లహోతీజీ.. వీటికి జవాబివ్వండి: కట్జూ
ఓ అవినీతి జడ్జి పదవీకాలం కొనసాగించే విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(సీజేఐలు) అసమంజసంగా రాజీపడ్డారని వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ.. మంగళవారం కూడా తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఈ ఆరోపణల గురించి తాను నిర్దిష్టంగా వేస్తున్న 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ముగ్గురు సీజీఐలలో ఒకరైన జస్టిస్ ఆర్.సి.లహోతీకి కట్జూ తన బ్లాగులో ప్రశ్నించారు. ఆ ప్రశ్నలివీ..
మద్రాస్ హైకోర్టుకు చెందిన ఓ అదనపు జడ్జిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)తోరహస్య దర్యాప్తు చేయించాలని నేను చెన్నై నుంచి ఆయనకు(లహోతీకి) లేఖ రాసిన మాట వాస్తవమా కాదా? తర్వాత ఇదే అంశంపై నేను ఆయన్ను ఢిల్లీలో కలిసింది నిజమా కాదా?నా అభ్యర్థన మేరకు జస్టిస్ లహోతీ ఆ అదనపు జడ్జిపై ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు చేయించింది నిజమా కాదా?
నేను జస్టిస్ లహోతీని ఢిల్లీలో కలిసి చెన్నై వచ్చిన తర్వాత.. ఆయన నాకు ఫోన్ చేసి.. అదనపు జడ్జిపై దర్యాప్తు చేయించానని, అవినీతి ఆరోపణలు నిజమేనని తేలిందని చెప్పిన మాట వాస్తవమా కాదా?ఐబీ నివేదిక వచ్చాక సమావేశమైన త్రిసభ్య కొలీజియం.. ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించవద్దని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం నిజమా కాదా?కొలీజియం సిఫార్సులను ప్రభుత్వానికి పంపిన తర్వాత.. ఆయన కొలీజియంలోని మిగతా ఇద్దరు సభ్యులనూ సంప్రదించకుండా తనంతట తానుగా ప్రభుత్వానికి లేఖ రాసి.. ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించాలని కోరడం నిజమా కాదా?ఐబీ దర్యాప్తులో అవినీతి ఆరోపణలు నిజమేనని తేలిన తర్వాత కూడా ఆయన ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాశారు?