ప్రధాని ఇలాకాలోనే.. అడ్డదిడ్డం ఆపరేషన్లు!
అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం. అక్కడే ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. వారణాసి జిల్లా చిరాయ్ పీహెచ్సీలో ఓ లేడీ డాక్టర్ ఇటీవల ఒకే రోజు 73 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి ఆరోగ్య కేంద్రం ఆరుబయట ఎండలో పడుకోబెట్టింది. అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్న ఆ పీహెచ్సీలో రికార్డు కోసమే డాక్టర్ లలిత్ యదవ్ ఒకేరోజు ఇన్ని ఆపరేషన్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిరాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం నాలుగు బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ మందికి అత్యవసర వైద్యం చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పోనీ ముందుగానే ఎక్కువ ఆపరేషన్లు అనుకున్నా కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. అదేమీ లేకుండా.. ఆపరేషన్ చేయించుకున్న మహిళలను ఎండలో నేలపైనే పడుకోబెట్టారట! మహిళల కుటంబ సభ్యులు, బంధువులు గొడవ చేస్తే హడావుడిగా రగ్గులు తెచ్చి కప్పారట. ఈ విషయాన్ని వారణాసి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని చెప్పారు.
ఇలాగే రికార్డు కోసం గత నవంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో డాక్టర్ ఆర్కే గుప్తా ఒకే రోజు 83 కుటంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంతో వైద్యం వికటించి 14 మంది మహిళలు మరణించిన విషయం తెలిసిందే.