శాలినీ యాదవ్‌తోనే మోదీకి పోటాపోటీ | Shalini Yadav Challenger To PM Modi In Varanasi | Sakshi
Sakshi News home page

శాలినీ యాదవ్‌తోనే మోదీకి పోటాపోటీ

Published Sat, May 11 2019 6:19 PM | Last Updated on Sat, May 11 2019 6:29 PM

Shalini Yadav Challenger To PM Modi In Varanasi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న యూపీలోని వారణాసికి ఏడవ విడత కింద మే 19వ తేదీన పోలింగ్‌ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మోదీకి దీటైన పోటీని ఇవ్వగలిగిన వారెవరన్నది చర్చనీయాంశమైంది. శాలినీ యాదవ్‌ అన్న ఓ మహిళా అభ్యర్థి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె పేరు దేశ ప్రజలకు తెలియకపోయిన వారణాసి మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేసినందున స్థానిక ప్రజలకు బాగానే తెలుసు. ఆమె సమాజ్‌వాది–బహుజన సమాజ్‌–రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.

2017లో జరిగిన వారణాసి మేయర్‌ ఎన్నికల్లో శాలినీ యాదవ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి 1.40 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఆమె ప్రత్యర్థిగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థికి దాదాపు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు శ్యామ్‌లాల్‌ యాదవ్‌ ఆమెకు మామ. ఆయన 1984లో వారణాసి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. శాలినీ యాదవ్‌ స్థానిక హిందీ సాయంకాలం దినపత్రిక ‘భారత్‌ దూత్‌’కు పబ్లిషర్, ఎడిటర్‌. మాజీ బీఎస్‌ఎఫ్‌ సైనికుడు తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో శాలినీ యాదవ్‌ను తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూటమి రంగంలోకి దించింది.

వారణాసి మేయర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థిగానే మోదీపైన పోటీ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మాట్లాడేందుకు ఆమె కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నించగా, అసలు విషయాన్ని ఆమె గ్రహించారేమో ఆమెకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహాకూటమి ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసుకొంది. ఆమెకు మద్దతుగా ఈ నెల 16వ తేదీన కూటమి వారణాసిలో ఎన్నికల సభను నిర్వహిస్తోంది. ఈ సభలో కూటమి నాయకులు అఖిలేష్‌ యాదవ్, మాయావతి, అజిత్‌ సింగ్‌లు ప్రసంగిస్తున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమైన సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నాయకులు వారణాసిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించి, ప్రసంగించడం వల్ల ప్రజలపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. పైగే మోదీని వ్యతిరేకించే ముస్లిం మైనారిటీలో అక్కడ మూడున్నర లక్షల మంది ఉన్నారు.

మూడు లక్షల మంది బ్రాహ్మణులు రెండవ అతిపెద్ద గ్రూపు. ఆ తర్వాత రెండు లక్షల మంది వైశ్యులు, 1.5 లక్షల మంది భూమిహార్లు, 1.5 లక్షల మంది కుర్మీలు, 1.5 లక్షల మంది యాదవ్‌లు, రెండు లక్షల మంది దళితులు ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మోదీకి అన్ని వర్గాల వారు ఓట్లు వేయడంతో 5.8 లక్షల ఓట్లు (56 శాతం) వచ్చాయి. ఇక్కడ ఓ అభ్యర్థి విజయం సాధించాలంటే 30 శాతం మించి ఓట్లు వస్తే చాలు. నాడు మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసిన ఆప్‌ నాయకుడు అరవింద్‌ కేజ్రివాల్‌కు 2.09 లక్షల ఓట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌కి 75 వేల ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థికి 60,000 ఓట్లు, ఎస్పీ అభ్యర్థికి 45 ఓట్లు వచ్చాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకుడు మురళీ మనోహర్‌ జోషి 2.03 లక్షల ఓట్లతో విజయం సాధించారు. కేజ్రివాల్‌కన్నా తక్కువ ఓట్లు.

నరేంద్ర మోదీకి గత ఎన్నికల్లో వచ్చినట్లుగా ఐదు లక్షల పైచిలుకు రావనే అంచనాలు ఎక్కువే ఉన్నప్పటికీ ఆయనే గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. బ్రాహ్మలు, వైశ్యులు ఆయనకే ఓట్లు వేస్తారు కనుక, ఆ రెండు వర్గాల ఓట్లే ఐదు లక్షలు ఉన్నందున ఆయన గెలవడం తేలికే. ఈసారి ఆయన దీటుగా మైనారిటీ ముస్లింలు, మిగతా సామాజిక వర్గాలు కలిస్తే గట్టి పోటీ ఉంటుందన్నది లెక్క. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ పార్టీ బలహీనమైన అజయ్‌రాయ్‌ని మళ్లీ బరిలోకి దింపిందన్నది రాజకీయ విశ్లేషణ. ఈ లెక్కన మోదీ, శాలినీ యాదవ్‌ మధ్యనే గట్టి పోటీ ఉంటుందనేది అర్థం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement