Shalini Yadav
-
భం భం బోలే మెజార్టీ మోగాలే!
ఇప్పుడు అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసి మీదే. ప్రధాని గెలుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయనకు ఎంత మెజార్టీ వస్తుందన్నదే చర్చనీయాంశం. 2014 ఎన్నికల్లో మోదీ పోటీ చేసిన ఈ స్థానంలో ప్రత్యర్థిగా అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మోదీని ఓడిస్తానని శపథం చేసి మరీ వారణాసి నుంచి బరిలోకి దిగారు. మోదీ హవా ముందు కేజ్రీవాల్ క్రేజ్ వెలవెలబోయింది. 3 లక్షల 71 వేల 785 ఓట్ల మెజార్టీతో మోదీ విజయదుందుభి మోగించారు. ఈసారి కేజ్రీవాల్ వంటి బలమైన అభ్యర్థులు బరిలో లేరు. ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థి శాలిని యాదవ్ రెండేళ్ల క్రితమే వారణాసి మేయర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి ఆమె మూడో స్థానానికే పరిమితమవుతారని అంచనాలున్నాయి. ఇక కాంగ్రెస్ తరఫు నుంచి అజయ్‌రాయ్ గత ఎన్నికల్లో పోటీకి దిగి కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయారు. అందుకే బీజేపీ ఈ సారి గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పక్కాగా అడుగులు వేస్తోంది. నామినేషన్ నుంచే బలప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నాదే అన్నట్టుగా నామినేషన్ నుంచే బలప్రదర్శనకు దిగారు. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే వారణాసిలో హర హర మోదీ నినాదాలు హోరెత్తేలా ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షో నిర్వహించి తన సత్తా చాటారు. ఆ తర్వాత జరిగిన గంగా హారతి, పడవ విహారం నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగాయి . మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్లో పట్టు బిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే వారణాసిపైన కూడా అంతే దృష్టి పెట్టారు. మోదీ కూడా ప్రతీ రోజూ ఏదో ఒక సమయంలో వారణాసికి వస్తూ పొలిటికల్ మూడ్ గమనిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, సిద్ధార్థనాథ్ సింగ్, శ్రీకాంత్ శర్మ, సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, వీకే సింగ్ వారణాసిలో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ సాధించాలన్న పట్టుదలతో పని చేశారు. గత అయిదేళ్లలో వారణాసిలో జరిగిన అభివృద్ధినే ప్రస్తావించారు. వారణాసిని జపాన్‌లో ఆధ్యాత్మిక నగరం క్యోటోగా మారుస్తానని గత ఎన్నికల్లో మోదీ తాను ఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయినా ఆ దిశగా పునాదులైతే పడ్డాయి. విద్యుత్ సౌకర్యం, రోడ్ల విస్తరణ, విశ్వనాథుడి ఆలయం నుంచి గంగా ఘాట్ వరకు కారిడార్, ఇంటింటికీ పైపు లైన్ల ద్వారా గ్యాస్ సౌకర్యం వంటి ప్రాజెక్టుల్లో పురోగతి కళ్లకు కనిపిస్తూనే ఉంది. ‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్ని వర్గాలకు ఇళ్లు కట్టి ఇచ్చాం. ఆయుష్, టాయిలెట్ స్కీమ్‌లు ముస్లింలకు కూడా ప్రయోజనకరంగానే ఉన్నాయి’’ అని కొందరు ముస్లింలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ప్రియాంకని కాకుండా ఎప్పుడైతే వేరే అభ్యర్థిని రంగంలోకి దింపిందో అప్పుడే చేతులెత్తేసిందని, మోదీకి తిరుగులేని మెజార్టీ ఖాయమన్న అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది. ‘‘మేము ఎన్నుకుంటున్నది ఒక ఎంపీని కాదు. ప్రధానమంత్రిని’’ –శిశిర్ వాజ్‌పేయి, బీజేపీ కార్యకర్త (ఇది కేవలం ఒక కార్యకర్త అభిప్రాయం మాత్రమే కాదు వారణాసి గుండె చప్పుడు కూడా ఇదే) -
శాలినీ యాదవ్‌తోనే మోదీకి పోటాపోటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న యూపీలోని వారణాసికి ఏడవ విడత కింద మే 19వ తేదీన పోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మోదీకి దీటైన పోటీని ఇవ్వగలిగిన వారెవరన్నది చర్చనీయాంశమైంది. శాలినీ యాదవ్ అన్న ఓ మహిళా అభ్యర్థి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె పేరు దేశ ప్రజలకు తెలియకపోయిన వారణాసి మేయర్ ఎన్నికల్లో పోటీ చేసినందున స్థానిక ప్రజలకు బాగానే తెలుసు. ఆమె సమాజ్‌వాది–బహుజన సమాజ్–రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 2017లో జరిగిన వారణాసి మేయర్ ఎన్నికల్లో శాలినీ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 1.40 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఆమె ప్రత్యర్థిగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థికి దాదాపు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్యామ్‌లాల్ యాదవ్ ఆమెకు మామ. ఆయన 1984లో వారణాసి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. శాలినీ యాదవ్ స్థానిక హిందీ సాయంకాలం దినపత్రిక ‘భారత్ దూత్’కు పబ్లిషర్, ఎడిటర్. మాజీ బీఎస్ఎఫ్ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో శాలినీ యాదవ్‌ను తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి రంగంలోకి దించింది. వారణాసి మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగానే మోదీపైన పోటీ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మాట్లాడేందుకు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నించగా, అసలు విషయాన్ని ఆమె గ్రహించారేమో ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహాకూటమి ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసుకొంది. ఆమెకు మద్దతుగా ఈ నెల 16వ తేదీన కూటమి వారణాసిలో ఎన్నికల సభను నిర్వహిస్తోంది. ఈ సభలో కూటమి నాయకులు అఖిలేష్ యాదవ్, మాయావతి, అజిత్ సింగ్‌లు ప్రసంగిస్తున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమైన సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నాయకులు వారణాసిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించి, ప్రసంగించడం వల్ల ప్రజలపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. పైగే మోదీని వ్యతిరేకించే ముస్లిం మైనారిటీలో అక్కడ మూడున్నర లక్షల మంది ఉన్నారు. మూడు లక్షల మంది బ్రాహ్మణులు రెండవ అతిపెద్ద గ్రూపు. ఆ తర్వాత రెండు లక్షల మంది వైశ్యులు, 1.5 లక్షల మంది భూమిహార్లు, 1.5 లక్షల మంది కుర్మీలు, 1.5 లక్షల మంది యాదవ్‌లు, రెండు లక్షల మంది దళితులు ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మోదీకి అన్ని వర్గాల వారు ఓట్లు వేయడంతో 5.8 లక్షల ఓట్లు (56 శాతం) వచ్చాయి. ఇక్కడ ఓ అభ్యర్థి విజయం సాధించాలంటే 30 శాతం మించి ఓట్లు వస్తే చాలు. నాడు మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసిన ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రివాల్‌కు 2.09 లక్షల ఓట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కి 75 వేల ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థికి 60,000 ఓట్లు, ఎస్పీ అభ్యర్థికి 45 ఓట్లు వచ్చాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి 2.03 లక్షల ఓట్లతో విజయం సాధించారు. కేజ్రివాల్‌కన్నా తక్కువ ఓట్లు. నరేంద్ర మోదీకి గత ఎన్నికల్లో వచ్చినట్లుగా ఐదు లక్షల పైచిలుకు రావనే అంచనాలు ఎక్కువే ఉన్నప్పటికీ ఆయనే గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. బ్రాహ్మలు, వైశ్యులు ఆయనకే ఓట్లు వేస్తారు కనుక, ఆ రెండు వర్గాల ఓట్లే ఐదు లక్షలు ఉన్నందున ఆయన గెలవడం తేలికే. ఈసారి ఆయన దీటుగా మైనారిటీ ముస్లింలు, మిగతా సామాజిక వర్గాలు కలిస్తే గట్టి పోటీ ఉంటుందన్నది లెక్క. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అజయ్‌రాయ్‌ని మళ్లీ బరిలోకి దింపిందన్నది రాజకీయ విశ్లేషణ. ఈ లెక్కన మోదీ, శాలినీ యాదవ్ మధ్యనే గట్టి పోటీ ఉంటుందనేది అర్థం అవుతోంది. -
ఈమె.. మానవ 'పాము'..!
-
ఈమె.. మానవ 'పాము'..!
- ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి కుబుసం విడుస్తున్న షాలిని - వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన స్పెయిన్‌లోని ఓ ఆసుపత్రి సాక్షి, ఛత్తర్పూర్: బాధలతో బతుకీడ్చడం కన్నా.. నాలుగు గోళీలు మింగి ప్రాణాలు తీసుకోవడం నయం.. కన్న కూతురి బాధను చూస్తున్న తల్లి గుండెకోత నుంచి వచ్చిన మాట అది. పేగు తెంచుకుని లోకాన్ని చూసిన నాటి నుంచి తన కూతురు నరకం అనుభవిస్తోందని షాలిని తల్లి దేవాంకుర్ కంటతడి పెట్టుకున్నారు. నిజానికి ఆమె కంటి నుంచి రావడానికి ఏమీ లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఆవిరైపోయింది. దేవాంకుర్, రాజ్ బహదూర్లు భార్యభర్తలు. వీరి స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నౌవ్‌గాంగ్ అనే కుగ్రామం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. వీరికి లేక లేక పుట్టిన సంతానం షాలిని. షాలిని పుట్టుక వారిలో ఆనందాన్ని నింపలేదు. వారి జీవితాలను మరింత బాధల్లోకి నెట్టింది. కారణం షాలిని శరీరం పాము పొలుసుల్లా ఉండటం. ఆమె శరీరం నుంచి ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి చర్మం రాలిపోయి మళ్లీ వస్తుంటుంది. రోజులో గంటకోసారి స్నానం, మూడు గంటలకోసారి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను షాలిని శరీరమంతా రాసుకుంటుంది. లేకపోతే పొలుసుల చర్మం తేమ కోల్పోయి మంట పెడుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా గత పదహారేళ్లుగా షాలిని అమ్మ దేవాంకుర్ కూతురిని ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. తొలుత ఓ మీడియా సంస్థ షాలిని దురావస్థను వెలుగులోకి తెచ్చింది. దీంతో స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆమె 'రెడ్ మ్యాన్ సిండ్రోమ్' అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. వైద్యం చేయించేందుకు భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో షాలిని తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి సుడులు తిరిగాయి. దీంతో ఆసుపత్రి నుంచి వెనుదిరిగి ఇల్లు చేరారు. రెండు రోజుల అనంతరం వారికి ఓ ఫోన్ వచ్చింది. స్పెయిన్‌లోని ఓ ఆసుపత్రి షాలినికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిందనే శుభవార్త తెలిసింది. దీంతో షాలిని ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. షాలిని తర్వాత దేవాంకుర్, రాజ్ బహదూర్ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు.