ఎన్ఐఏ అధికారి కేసులో మాస్టర్మైండ్ దొరికాడు
లక్నో: దేశంలో సంచలనం సృష్టించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి తాంజిల్ అహ్మద్ హత్యకు సంబంధించి కీలక సూత్రధారిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్టు చేశారు. నోయిడా అనే ప్రాంతంలో ఈ హత్య కీలక నిందితుడు మునీర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏప్రిల్ నెలలో తన భార్యతో కలిసి కారులో వస్తున్న తాంజిల్ను మధ్యలో అడ్డగించిన కొందరు దుండగులు బైక్పై వచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ కాల్పుల్లో 24 బుల్లెట్లు దిగి తాంజిల్ అక్కడికక్కడే చనిపోగా నాలుగు బుల్లెట్లు తగిలి పది రోజులపాటు ఆస్పత్రిలో ఉండి ఆయన భార్య కన్నుమూసింది. ఈ కేసుపై వేగంగా స్పందించిన పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అంతకుముందు రిజ్వాన్, తాంజీమ్, రెహాన్, జైనుల్ అనే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. వీరిలో రెహాన్ అనే వ్యక్తి అహ్మద్ భావ మేనళ్లుడు. అలాగే జైనుల్ కూడా. కుటుంబ పరమైన కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.