
'20 లక్షలు వద్దు.. మా కొడుకును తెండి'
మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం సందర్భంగా గురువారం జరిగిన హింసాకాండలో మృతి చెందిన వారి సంఖ్య 21కి పెరిగింది. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. 40 మంది గాయపడ్డారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం మథురలోని జవహార్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తుండగా ఆందోళనకారులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఘర్షణ మొదలైంది.
ఈ ఘటనలో మథుర ఎస్పీ ముకుల్ ద్వివేది, ఫరాహ్ పీఎస్ అధికారి సంతోష్ యాదవ్ మృతి చెందారు. గాయపడిన వారిలో నగర మేజిస్ట్రేట్ జావేద్ అహ్మద్ కూడా ఉన్నారు. కాగా, ముకుల్ ద్వివేది మరణంతో ఆయన తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు తమకు అవసరం లేదని, తమ కొడుకును తెచ్చివాలని ముకుల్ తల్లిదండ్రులు విలపించారు. 'ముఖ్యమంత్రి మాకు రూ. 20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ డబ్బు మాకొద్దు. మా బిడ్డను తిరిగి తెచ్చివండి' అని వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు.