
మీరు ‘నెగటివ్ దళిత్ మ్యాన్ ’
యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు వ్యక్తిగతంగా మారాయి.
మోదీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మాయావతి
సుల్తాన్ పూర్: యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు వ్యక్తిగతంగా మారాయి. బెహన్ జీ సంపత్తి పార్టీ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ చీ‹ఫ్ మాయావతి తిప్పికొట్టారు. సుల్తాన్ పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో.. ప్రధాని మోదీ పూర్తి పేరైన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ పేరుకు ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్ ’ అని సరికొత్త నిర్వచనాన్నిచ్చారు. తనకు మద్దతుగా ఉన్న దళితులకు మోదీ పూర్తి వ్యతిరేకమని ఆమె విమర్శించారు. ‘బీఎస్పీ ఎలా ప్రారంభమైందో.. ఏయే ఉద్యమ పునాదుల మీద పార్టీ నిర్మాణం జరిగిందో మోదీ తెలుసుకోవాలి.
నా జీవితమంతా దళితులు, పేదలు, అణగారిన వర్గాలు, ముస్లింలలో సాధికారత కల్పించేందుకు అంకితం చేశాను. మోదీ బీఎస్పీని తప్పుగా నిర్వచిస్తున్నారు. నేను సంపత్తి (సంపద) కోసం ప్రయత్నించలేదు. ప్రజలే నా సంపద’ అని మాయావతి తెలిపారు. కార్యకర్తలు ఇచ్చే విరాళాల ద్వారానే బీఎస్పీ నడుస్తోందన్న మాయావతి.. మోదీ చేతలు, ప్రవర్తన ఆధారంగానే ఆయన దళిత వ్యతిరేకి అని నిర్వచించాల్సి వచ్చిందన్నారు. బీఎస్పీకి రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రధాన మంత్రి ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.