పార్టీ నేతల మధ్య మఫ్తీ కంటతడి
శ్రీనగర్: తన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో జమ్మూకశ్మీర్లోని పీడీపీ నేత మెహబూబా మఫ్తీ కంటతడిపెట్టారు. అదే సమయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే విషయంపై మౌనం వహించారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ మఫ్తీ గత గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు మెహబూబానే స్వీకరిస్తారని చెప్తూ వస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
బీజేపీ కూడా మెహబూబాకు ఇప్పటి వరకు స్పష్టమైన మద్దతుపై బహిరంగ ప్రకటనా చేయలేదు. అదీ కాకుండా ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నేత నితిన్ గడ్కరీలు ఆమెను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. అయితే, తాము కేవలం సంతాపం తెలిపేందుకే వచ్చామని, ఎలాంటి రాజకీయాలు చేసే ఉద్దేశంతో రాలేదని ఇరువురు నేతలు ప్రకటించారు. వీరి భేటీ అనంతరం పీడీపీ నేతలతో మెహబూబా భేటీ అయ్యి కేవలం పార్టీ బలోపేతంపైనే చర్చించారని, సీఎం పీఠం విషయంపై ఎలాంటి స్పందన, అభిప్రాయం చెప్పలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. అదే సమయంలో సమావేశంలో కంటతడిపెట్టారని కూడా వివరించారు.