కీలక రాష్ట్రానికి తొలి మహిళా సీఎం
శ్రీనగర్: శాంతిభద్రతలు, రక్షణ అంశాల పరంగా దేశంలోనే అత్యంత కీలకమైన రాష్ట్రమది. పలు దేశాలతో సరిహద్దులు పంచుకుంటూ, మరే రాష్టరంలోనూ లేని విధంగా 370 ఆర్టికల్ అమలవుతున్న జమ్ము కశ్మీర్ కు మొదటిసారి ఓ మహిళ ముఖ్యమంత్రి కానుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో జయలలిత, రాజస్థాన్ లో వసుంధరా రాజే, పశ్చిమ బెంగాల్ లో మమతల మాదిరి జమ్ముకశ్మీర్ లోనూ మొదటిసారి సీఎం పీఠాన్ని మహిళామని అధిష్ఠించనున్నారు.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ మహమూద్ సయీద్ గురువారం అనారోగ్యంతో అకాలమరణం చెందడంతో పీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న ఆయన తనయ, ప్రస్తుత ఎంపీ మెహబూబా ముఫ్థీ(56) అత్యున్నత పదవిని అలంకరించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. జమ్ములోని షేర్ ఇ కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా కార్యక్రమం జరుగుతుందని, అయితే ముఫ్తీ కుటుంబం విషాదంలో ఉన్నందున కొద్ది రోజుల తర్వాతే ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
80 ఏళ్ల వయసులో తాను చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేక పోతున్నానని, తన వారసురాలిగా మెహబూబాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని దివంగత మహమూద్ గతంలోనే పార్టీకి సూచించారు. పీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవించడంతో మోహబూబా పదవీస్వీకారానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఆమెను సీఎంగా ఆమోదిస్తూ ఎమ్మెల్యేలు గురువారమే రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోరాకు ఒక లేఖను సమర్పించారు.
అటు బీజేపీ కూడా మెహబూబా ఎన్నికపై సానుకూలంగా స్పందించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేతలు ముజఫర్ హుస్సేన్ బేగ్, అల్తాఫ్ బుఖార్ గవర్నర్కు లేఖను అందించారు. ముఖ్యమంత్రిగా మెహబూబ్ సరైన వ్యక్తిగా తాము భావిస్తున్నామని ఆమె ఎన్నిక పట్ల తమకు అభ్యంతరం లేదని బీజేపే తేల్చిచెప్పింది.
మోహబూబా పర్సనల్ టచ్..
పూర్తిపేరు: మోహబూబా ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్
పుట్టిన తేది: 22-05-1959 (ప్రస్తుతం 56 ఏళ్లు)
చదువు: ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ నుంచి బీఏ, ఎల్ఎల్ బి
వైవాహిక స్థితి: పూర్తి కాలాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలనుకున్న మోహబూబా.. చాలా కాలం కిందటే భర్త జావేద్ ఇఖ్బాల్ కు విడాకులిచ్చారు.
సంతానం: ఇద్దరు కూతుళ్లు. ఇర్తికా ఇఖ్బాల్, ఇల్తిజా ఇఖ్బాల్.
పార్టీలో ప్రస్తుత స్థానం: జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు