బెంగళూరులో జలకన్య.. విస్మయం | Mermaid in Bengaluru's Pothole | Sakshi
Sakshi News home page

బెంగళూరులో జలకన్య.. వాహనదారుల విస్మయం

Published Fri, Oct 13 2017 3:52 PM | Last Updated on Fri, Oct 13 2017 7:54 PM

Mermaid in Bengaluru's Pothole

నిత్య రద్దీగా ఉండే బెంగళూరు నగర రోడ్లపై ఇప్పుడొక వింత వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రోడ్డుపై ఏర్పడిన చిన్నపాటి సరస్సులో జలకన్య కనిపించడం.. బెంగళూరు వాసులను విస్మయపరుస్తోంది. అదే సమయంలో.. ఆ జలకన్యను... దానిని సృష్టించిన ఆర్టిస్‌/ఆర్ట్‌ డైరెక్టర్‌ బాదల్‌ నంజుందస్వామిని బెంగళూరు వాసులు మెచ్చుకుంటున్నారు.

ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. చాలాచోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి.. అందులో నీరు చేరి.. చిన్నపాటి నీటి సరస్సులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లపై 16వేల పాఠోహోల్స్‌ (గుంతలు) ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

గత సెప్టెంబర్‌ నెలలో బెంగళూరులో ఎడతెగని వర్షాలు ముంచెత్తాయి. అక్టోబర్‌ నెలలోనూ వర్షాలు కొనసాగాయి. ఈ వర్షాలకు నగరం రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఈ రహదారుల వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వాహనదారుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు బాదల్‌ తన కళతో ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే రద్దీగా ఉండే ఎంజీ రోడ్డుకు సమీపంలో.. పరేడ్‌ గ్రౌండ్‌కు దగ్గరగా ఉన్న జంక్షన్‌లో రోడ్డుపై ఏర్పడిన గుంతలో బాదల్ శుక్రవారం ఓ చిన్నపాటి సరస్సును చిత్రించాడు. అంతేకాదు సోను గౌడ అనే మోడల్‌ జలకన్యగా.. ఆ చిన్నపాటి సరస్సు వద్ద తచ్చాడుతూ కనిపించింది. నిత్యం రద్దీ ట్రాఫిక్‌ జామ్‌లో ప్రయాణించే వాహనదారులు కొంతసేపు ఆగి.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. పలువురు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.

మొత్తానికి రోడ్డుపై ఉన్న ఇలాంటి చిన్నపాటి సరస్సులు, చిరు చెరువులు, గుంతలు, కంతలు వెలుగులోకి తీసుకొచ్చి.. మున్సిపల్‌ సిబ్బంది వాటిని పట్టించుకొని మరమ్మతు చేసేలా గత కొన్నాళ్లుగా బాదల్‌ తన కళతో ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది రోడ్డుపై నీటిగుంటలో మొసలి చిత్రించడం ద్వారా ఆయన మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఉన్న గుంతల్లో ఇలాంటి బొమ్మలు అనేకం చిత్రించడం ద్వారా ఈ సమస్యపై ప్రజల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో అవగాహన కలిగించేలా ఆర్టిస్ట్‌ బాదల్‌ ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement