
సాక్షి, ఢిల్లీ : దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి ఊరట లభించింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, తీర్థయాత్రలకు వెళ్లినవారు, వారి స్వస్థలాలకు చేర్చడంపై కేంద్ర హోంశాఖ బుధవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. రెండు రాష్ట్రాల అనుమతితో వారి ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ప్రయాణించే వారికి కరోనా వైద్య పరీక్షలు చేశాకే, సొంత రాష్ట్రాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. సొంత రాష్ట్రాలకు చేరుకోగానే హోం క్వారంటైన్‌లో పెట్టాలని ఆదేశించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్న వారిని ఆరోగ్య సేతు యాప్ ద్వారా పర్యవేక్షించాలని, వారందరినీ ఆ యాప్‌తో అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.
తరలింపులో భాగంగా అన్ని రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించుకొని చిక్కుకుపోయిన వారి వివరాలు సేకరించాలని హోంశాఖ సూచించింది. తరలించే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. బస్సులను ఒక గ్రూపులా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని, బయలుదేరే ముందు అన్ని బస్సులను శానిటైజ్ చేయాలని స్పష్టం చేసింది. వారిని తరలించే మార్గాలపై ఇరు రాష్ట్రాలు సమన్వయం చేసుకుని చివరి ప్రదేశం వరకు వెళ్లేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment