![తప్పిపోయిన రైలు.. 17 రోజులకు ఆచూకీ!](/styles/webp/s3/article_images/2017/09/2/41409260712_625x300_0.jpg.webp?itok=WknYELOK)
తప్పిపోయిన రైలు.. 17 రోజులకు ఆచూకీ!
ఎక్కడైనా పిల్లలు తప్పిపోవడం చూశాం, వస్తువులు పోవడం చూశాం. కానీ బీహార్లో ఓ రైలు తప్పిపోయి.. ఏకంగా 17 రోజుల తర్వాత మళ్లీ కనిపించింది. గోరఖ్పూర్-ముజఫర్పూర్ ప్యాసింజర్ రైలు ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి హాజీపూర్లో తప్పిపోయింది. ఆ ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను వేర్వేరు మార్గాలకు మళ్లించారు. అదే సమయంలో ఈ రైలు కనిపించకుండా పోయింది. రైలు ఏమయ్యిందోనని అందరూ గాభరా పడ్డారు.
రైలు వేరే మార్గంలో వెళ్తుండటంతో గమనించిన ప్రయాణికులు ఎందుకొచ్చిన బాధ అని దిగిపోయారు. ఈలోపు రైలు 'తప్పిపోయింది' అని ప్రకటన వచ్చినట్లు సమస్తిపూర్ రైల్వే డివిజనల్ మేనేజర్ అరుణ్ మాలిక్ తెలిపారు. చివరకు మరో డివిజన్లోని ఓ రైల్వే స్టేషన్లో ఎట్టకేలకు 17 రోజుల తర్వాత రైలు కనిపించిందని ఆయన చెప్పారు. అయితే, తమకు తామే ఆ రైలును కనుక్కోవడంతో రైలు తప్పిపోవడంపై పోలీసు కేసు ఏదీ నమోదు చేయలేదని మాలిక్ అన్నారు.