తప్పంతా ఆమెదే: ‘నిర్భయ’ దోషి ముఖేశ్
న్యూఢిల్లీ: ‘ఆమెనే తప్పు పట్టాలి. ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు’. ఢిల్లీలో రెండేళ్ల క్రితం నిర్భయపై కిరాతకానికి పాల్పడి, ఉరిశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భారత కూతురు’ పేరుతో మార్చి 8న ఎన్‌డీటీవీలో రానున్న డాక్యుమెంటరీలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు.
ఉరిశిక్ష అమలుకానున్నా ఎలాంటి పశ్చాత్తాపం లేని ముఖేశ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రేప్ జరగడానికి పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ బాధ్యులన్నాడు. నిర్భయ ఉదంతం యాదృచ్ఛికంగా జరిగిందని, ఆమె ఎదురు తిరగకపోయి ఉంటే అత్యాచారం చేశాక మామూలుగా వదిలేసి పోయేవారన్నాడు. ఇంతకుముందు అత్యాచారం చేసి బెదిరించి వదిలేసేవారని, ఉరిశిక్ష వల్ల ఇక ముందు బాధితురాలిని చంపేస్తారన్నాడు.