న్యూఢిల్లీ: తీహార్ జైల్లో తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని, విపరీతంగా కొట్టారని, లైంగికంగా వేధించారని నిర్భయపై అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రపతి కోవింద్ క్షమాభిక్ష ఇవ్వడంలో మనసు పెట్టి ఆలోచించలేదని అన్నారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సుప్రీంకోర్టుకెక్కారు. దీనిపై సుప్రీం కోర్టులో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. జైల్లో ముఖేష్‌ను కొట్టేవారని, లైంగికంగా వేధించారని అతని తరఫు లాయర్ అంజనా ప్రకాశ్ చెప్పారు. అందరూ కలిసి ఒక వ్యక్తి జీవితంతో చెలగాటమాడుతున్నారని, క్షమాభిక్ష అంశంలో రాష్ట్రపతి మనసుపెట్టి ఆలోచించలేదని వాదించారు.
దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ స్పందించారు. రాష్ట్రపతి కోవింద్ అన్ని కోణాల నుంచి ఆలోచించలేదని, క్షమాభిక్ష సమయంలో కరుణ చూపలేదని మీరెలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. క్షమాభిక్ష పిటిషన్ సమయంలో కేంద్రం వాస్తవాలన్నీ రాష్ట్రపతికి సమర్పించలేదని, ఆయన క్షమాభిక్ష నిరాకరించడానికి ముందే ముఖేష్‌ని ఏకాకిని చేసి ఒక గదిలో బంధించారని, అది జైలు నిబంధనలకు విరుద్ధమని, ఆమె తన వాదనలు వినిపించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జైల్లో ఉండే వారు అనుభవించే బాధలు క్షమాభిక్ష ఇవ్వడానికి ప్రాతిపదిక కాదన్నారు. కేంద్రం అన్ని డాక్యుమెంట్లు రాష్ట్రపతికి సమర్పించిందని, అంత ఘోరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి ఎవరైనా క్షమాభిక్ష ఇస్తారా అని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం బెంచ్ తీర్పుని బుధవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment