నోయిడా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో కలిసి శాంసంగ్ నూతన మొబైల్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ఇరు దేశాల అధ్యక్షులు మెట్రో రైలులో ఢిల్లీ నుంచి నోయిడా చేరుకున్నారు. దీని కంటే ముందు మహాత్మాగాంధీ స్మృతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కచేరిలో మహాత్మనికి ఇష్టమైన భజనలను విన్నారు.
ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోదీ ‘ఒక్క కొరియన్ ఉత్పత్తి అయినా లేని మధ్యతరగతి కుటుంబాలు మన దేశంలో చాలా అరుదు. అంతగా ఈ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మన ప్రభుత్వం గవర్నమెంట్ ఈ-మార్కెట్(జీఈఎమ్) విధానాన్ని అవలంభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం కలగడమే కాక పారదర్శకత కూడా పెరుగుతుందని’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా హాజరయ్యారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన గురించి మూన్ జే.. ‘భారత ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తుంది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు మేము ఉత్సాహాంగా ఉన్నాం’ అని తెలిపారు. భారత్‌ను ఓ స్నేహదేశంగా గుర్తిస్తామని, తమకు అవసరమైనప్పుడల్లా భారత్ సాయం చేసిందన్నారు. తమ దేశం సదరన్ పాలసీని చేపట్టిందని, దానిలో భాగంగా భారత్‌తో మరింత బలమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని భావిస్తున్నట్లు మూన్ జే తెలిపారు.
శాంసంగ్ ప్లాంట్...
దక్షిణ కొరియా బేస్డ్ స్మార్ట్‌ఫోన్‌ల దిగ్గజ కంపెనీ శాంసంగ్ ప్రపంచంలోకెల్ల అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో మొబైల్ ఫోన్స్ మాత్రమే కాక టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఎలాక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేస్తున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు.
ఈ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు...
- 35 ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 81లో ఏర్పాటు చేశారు.
- అయితే నోయిడా ప్లాంట్‌కు 1996లోనే శంకుస్థాపన చేశారు. 1997 నుంచి తొలిసారి ఇక్కడ టెలివిజన్‌లను తయారుచేయడం ప్రారంభించారు. 2003 నాటికి రిఫ్రిజిరేటర్లను కూడా తయారు చేయడం ప్రారంభించారు.
- 2007 నుంచి ఇక్కడ మొబైల్ ఫోన్లను తయారుచేస్తున్నారు.
- ప్రస్తుతం శాంసంగ్ మొబైల్, ఎలాక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిని రెండు రెట్లు పెంచడం కోసం ఈ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
- ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను సార్క్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
- ఇప్పటి వరకూ ఇండియాలో శాంసంగ్ తయారీ యూనిట్లు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి నోయిడాలో ఉండగా మరొకటి తమిళనాడులోని శ్రీపెరంబ్‌దూర్‌లో ఉంది. ఇవే కాక 5 ఆర్ అండ్ డీ సెంటర్లతో పాటు నోయిడాలో ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది. వీటిన్నింటి ద్వారా దాదాపు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇవేకాక శాంసంగ్ ఔట్‌లెట్ల ద్వారా మరో 1.50లక్షల మందికి కంపెనీ ఉపాధి కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment