
‘ఉపాధి హామీ’ దేశానికే గర్వకారణం
మోదీ సర్కారు ప్రశంసలు
♦ పథకానికి నేటితో పదేళ్లు పూర్తి
♦ బలోపేతం చేస్తామని ప్రకటన
♦ నేడు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ సమ్మేళన్
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ పేదలకు ఏటా కనీసం వంద రోజుల ఉపాధి కల్పించేందుకు గత యూపీఏ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మంగళవారంతో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ చీఫ్(జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్ హోదాలో) సోనియా గాంధీ లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును తొలుత విమర్శించిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం మాత్రం పొగడ్తలతో ముంచెత్తింది. పథకం సాధించిన దశాబ్ది ఫలితాలు దేశానికే గర్వకారణమని, సంబరాలు చేసుకోదగ్గవని ప్రశంసించింది.
పథకం నిబంధనలను భవిష్యత్తులో తాము సరళీకరించడంతోపాటు దాని అమలును బలోపేతం చేస్తామని...పేదల లబ్ధికి దోహదపడే ఆస్తుల నిర్మాణం చేపట్టడంపై దృష్టిసారిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించనున్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ సమ్మేళన్-2016లోఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించి ఆయన పలు ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి లబ్ధి చేకూర్చేందుకు వంద రోజుల పని దినాలకు అదనంగా 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. కాగా ఈ పథకం కోసం అదనంగా రూ.5వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రావ్ బీరేంద్ర సింగ్.. జైట్లీకి లేఖ రాశారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 45.88 కోట్లు, మూడో క్వార్టర్‌లో 46.10 కోట్ల పనిదినాలు సృష్టించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. 57 శాతం మిహ ళలే పథకం కింద లబ్ధి పొందారంది.
నేడు బండ్లపల్లి గ్రామానికి రాహుల్
ఉపాధి హామీ పథకం పదేళ్ల సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఏపీలోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు.
ఉపాధి హామీ పథకం అమలు వివరాలు
ఇప్పటి వరకూ ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించిన వేతనాలు రూ. 3,13,844 కోట్లు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్‌టీలు17శాతం, మహిళలు 57శాతానికి పెరుగుదల. కార్మికులకు లభించిన పనిదినాలు 1980కోట్లు. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పనులు 65 శాతం.