
మోదీది అధికార దాహం: సోనియా
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దురాశతో అరుణాచల్, ఉత్తరాఖండ్‌లో ప్రజాతీర్పును మోదీ సర్కారు అగౌరవపరిచిందని...
నాందేడ్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దురాశతో అరుణాచల్, ఉత్తరాఖండ్‌లో ప్రజాతీర్పును మోదీ సర్కారు అగౌరవపరిచిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. బీజేపీ మద్దతుతో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏర్పడిన కలిఖోపుల్ సర్కారును రద్దుచేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో సోనియా పైవిధంగా స్పందించారు. ‘అధికార వ్యామోహంతో మోదీ సర్కారు భారత రాజ్యాంగ నియమావళిని ఉల్లంఘిస్తూ రెండు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసింది.
ప్రజాతీర్పును అగౌరవపరిచింది.’ అని అన్నారు. గురువారం నాందేడ్‌లో మాజీ కేంద్ర మంత్రి శంకర్రావ్ చవాన్ విగ్రహావిష్కరణ, స్మారక మ్యూజియం ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘శంకర్రావ్ ఇవాళ బతికి ఉండిఉంటే మోదీ సర్కారు కుట్రలను చూసి ఎంతో బాధపడేవారు. పెట్టుబడిదారులు తీసుకున్న వేలాది కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీచేసింది. రైతులను మాత్రం వారి ఖర్మకు వదిలేసింది.’ అని సోనియా ఆరోపించారు.