
మోదీపై ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇద్రిస్ అలీ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వివాదాస్పద విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. మోదీ లాహార్ పర్యటనకు వెళ్లివచ్చిన కొన్ని రోజులకే పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది? ఉగ్రవాదులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయేమోనని భావిస్తున్నాని అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అలీ చెప్పారు.
అలీ.. సీపీఎం నాయకుడు గౌతమ్ దేవ్పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శారద చిట్ఫండ్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడితే గౌతమ్ కాళ్లు నరికేస్తానని, ఆయన్ని జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. కాగా అలీ వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు పరిధి దాటాయని, అనుచితమని పేర్కొంది. అలీ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు వెల్లడించింది.