‘మోడీ కుర్తా’కు అమెరికా ఫిదా
అగ్రరాజ్యం మీడియా ప్రశంసల జల్లు
వాషింగ్టన్: కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోడీకి తమ దేశంలోకి అనుమతిలేదంటూ తిరస్కరించిన అమెరికా.. ఇపుడు ఆయన్ను ఒక తరహా ఫ్యాషన్‌కు ప్రతినిధిగా భావిస్తోంది. భారత్‌లో బీజేపీ విజయదుందుభి మోగించిన తర్వాత ఇక్కడి మూడు ప్రఖ్యాత వార్తా పత్రికలు.. టైమ్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ మోడీ ట్రేడ్‌మార్క్ కుర్తాపై, దానిని ఆయన ధరించే తీరుపై ప్రశంసలు కురిపించాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ‘‘ఒక నేత ఎవరు అతను ఎలాంటివి ధరిస్తాడు’’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో మిషెల్లీ ఒబామా డ్రెస్సింగ్ స్టయిల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలెండీ, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రోసెఫ్ మేకప్, దివంగత నల్ల సూరీడు నెల్సన్ మండేలా చొక్కాల కన్నా భారత కొత్త ప్రధాని మోడీ వస్త్రధారణ ప్రత్యేకమైనదని, దానిని ఒక కొత్త కేస్ స్టడీలా పరిగణించవచ్చని పేర్కొంది. ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే.. ‘‘మిషెల్లీ ఒబామాను పక్కనబెట్టండి. ప్రపంచానికి కొత్త ఫ్యాషన్ ప్రతినిధి లభించాడు. అది ఫిట్‌నెస్‌తో ఉండే పుతిన్ కాదు. భారత కొత్త ప్రధాని నరేంద్ర మోడీ’’ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కుర్తాతో మోడీ ఒక సెలెబ్రిటీలా మారిపోయారని టైమ్ పత్రిక శుక్రవారం రాసింది. భారత ఫ్యాషన్లో ఆయన అగ్రగణ్యుడిగా నిలుస్తాడని కొనియాడింది.
మోడీ పర్యటన తేదీలు ఖరారు కాలేదు: అమెరికా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ దేశ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. మోడీ పర్యటనపై విలేకరులతో మాట్లాడిన ఆదేశ విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి మేరీ హార్ఫ్.. తేదీలపై తుది సమాచారం లేదని తెలిపారు. భారత ప్రధానికి స్వాగతం పలకడంపై అధ్యక్షుడు బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఎదురు చూస్తున్నారని, అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తెలియదని హార్ఫ్ చెప్పారు. సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారని, ఆ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని భారత ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం తెలిసిందే.