ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆప్ చేపట్టిన ర్యాలీ లో రైతు ఆత్మహత్య దుర్ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆందోళనతో ఈ వివాదం మరింత ముదురుతోంది. గురువారం ఉదయం ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ ముందు బీజేపీ ఆందోళన నిర్వహిస్తే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటిముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. పెద్ద ఎత్తున గుమిగూడిన పార్టీ కార్యకర్తలు... రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు కేజ్రీవాల్ బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు సచిన్ పైలట్ మృతిచెందిన రైతు గజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులను కలవనున్నట్టు సమాచారం.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ అంశంపై సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడుతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇది ఇలా ఉంటే రైతు ఆత్మహత్యపై ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలతో పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళం నెలకొంది. కాగా భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ర్యాలీ సందర్భంగా రాజస్థాన్ నుంచి వచ్చిన రైతు గజేంద్ర సింగ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.