senior ministers
-
సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు
ఒకరేమో జిల్లా మంత్రి... మరొకరు జిల్లా ఇన్చార్జి మంత్రి... ఇద్దరూ టీడీపీలో అత్యంత సీనియర్లే... ఎన్టీఆర్, చంద్రబాబు కేబినేట్లలో కలసి పనిచేసినవారే. పైగా ఇరుగుపొరుగు జిల్లాలవారే. అయితే మాత్రం...! ‘ఎక్కడైనా బావగానీ.. వంగ తోట కాడ కాదు’ అన్నట్లుగా తయారైంది వారి పరిస్థితి. జిల్లాపై పెత్తనం చెలాయించాలని ఇన్చార్జి మంత్రి చూస్తుంటే... అసలు మీ పెత్తనం ఏమిటని జిల్లా మంత్రి అడ్డుపడుతున్నారు. ఎందుకంటే అటు ఇన్చార్జి మంత్రి, ఇటు జిల్లా మంత్రి ఇద్దరూ కన్నేసింది ఒకే వ్యవహారంపై. అక్రమంగా కోట్లు కురిపిస్తున్న ఇసుక దందాతోపాటు ఉన్నతాధికారుల నియామక వ్యవహారం మీద ఇద్దరూ తమ మాటే చెల్లాలని పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిదంటే.. ఇన్చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్క అధికారిక సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా అతన్ని కట్టడి చేశారు. ఇదంతా అనుకుంటున్నారా!.. వీరిలో జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కాగా.. ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు. వీరిద్దరి ఆధిపత్య పోరుకు వేదిక.. విశాఖ జిల్లా.. ► యనమల ఆధిపత్యాన్ని సహించని జిల్లా మంత్రి ► సమావేశాలే నిర్వహించని ఇన్చార్జి మంత్రి ► ఇసుక దందా, అధికారుల బదిలీల్లో ఆధిపత్య పోరే కారణం విశాఖపట్నం: విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇసుక ర్యాంపుల వ్యవహారం మంత్రులు అయ్యన్న, యనమల మధ్య చిచ్చుపెట్టింది. మంత్రి యనమల కుటుంబ సభ్యులు జిల్లా సరిహద్దు దాటి విశాఖ జిల్లాలోకి వచ్చి మరీ భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే పాయకారావుపేట నియోజకవర్గంలో ఇసుక దందాపై యనమల కుటుంబ సభ్యుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీరి పెత్తనమేమిటంటూ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. వారి దందాను అడ్డుకుని ఆధిపత్యం సాధించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య చిన్నగా విభేదాలు ప్రారంభమయ్యాయి. అంతలోనే ఏడాది క్రితం విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా యనమల రామకృష్ణుడును సీఎం నియమించారు. ఇది అయ్యన్నకు ఏమాత్రం రుచించలేదు. మరోవైపు యనమల కూడా దూకుడుగా వ్యవహరించి జిల్లా వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకోవాలని భావించారు. జిల్లాలో ఉన్నతాధికారుల నియామకంలో యనమల కల్పించుకోవడాన్ని కూడా అయ్యన్న సమ్మతించలేదు. జిల్లాలో వివాదాస్పదమైన ఆర్డీవో, డీఆర్వో నియామకాల్లో మంత్రి యనమల తనదైన పంథాలో వ్యవహరించడాన్ని అయ్యన్న అడ్డుకున్నారు. తాజాగా తాండవ నదిలో ఇసుక ర్యాంపులు దక్కించుకునేందుకు మంత్రులు పోటీపడుతున్నారు. అందుకోసం పంతాలకు పోతున్నారు. అడుగడుగునా అడ్డుకట్ట ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాపై పట్టు సాధించేందుకు యనమలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అయ్యన్న పాత్రుడు భీష్మించుకున్నారు. అందుకే జిల్లాలో యనమల ఇంతవరకు ఎలాంటి అధికారిక సమావేశాన్ని నిర్వహించలేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా డీఆర్సీ సమావేశంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలను నిర్వహించాలని యనమల భావించారు. ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అయ్యన్నకు తెలియజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ‘ఇప్పుడేమీ సమావేశాలు వద్దు. తరువాత నేను చెబుతా’ అని ముక్తసరిగా తేల్చేశారు. దాంతో ఇన్చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా యనమల రామకృష్ణుడు ఇంతవరకు జిల్లాలో అధికారికంగా ఎలాంటి సమావేశాన్ని నిర్వహించలేకపోయారు. సీఎం చంద్రబాబు వస్తే ఆ పర్యటనలో పాల్గొనడం మినహా అధికారికంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారనే అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘నా పుట్టలో వేలు పెడితే కుట్టనా’ అన్నట్లుగా మంత్రి అయ్యన్న వ్యవహరిస్తున్నారు. -
చెన్నై వాసులను ఎలా ఆదుకుందాం?
కనీవినీ ఎరుగని వర్షబీభత్సంతో అతలాకుతలం అవుతున్న చెన్నైలోని పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీనియర్ మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో బిక్కుబిక్కుమంటున్న చెన్నై వాసులను ఆదుకోవడంపై చర్చించారు. చెన్నైలో అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక, రక్షణ చర్యలపై మంత్రులతో మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాసర్వాజ్, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వర్షాలతో నిండుకుండగా మారిన చెన్నైకి సహాయక బృందాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే జాతీయ విపత్తు సహాయక దళానికి (ఎన్డీఆర్ఎఫ్) పది బృందాలను చెన్నైకి తరలించారు. ఆర్మీ, నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇక చెన్నై రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున చిక్కుకున్న ప్రయాణికులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు రైల్వే అధికారి అనిల్ సక్సేనా తెలిపారు. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో చెన్నై వాసుల కష్టాలకు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. -
ఆప్‌పై కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడి
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆప్ చేపట్టిన ర్యాలీ లో రైతు ఆత్మహత్య దుర్ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆందోళనతో ఈ వివాదం మరింత ముదురుతోంది. గురువారం ఉదయం ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ ముందు బీజేపీ ఆందోళన నిర్వహిస్తే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటిముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. పెద్ద ఎత్తున గుమిగూడిన పార్టీ కార్యకర్తలు... రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు కేజ్రీవాల్ బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు సచిన్ పైలట్ మృతిచెందిన రైతు గజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులను కలవనున్నట్టు సమాచారం. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ అంశంపై సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడుతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇది ఇలా ఉంటే రైతు ఆత్మహత్యపై ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలతో పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళం నెలకొంది. కాగా భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ర్యాలీ సందర్భంగా రాజస్థాన్ నుంచి వచ్చిన రైతు గజేంద్ర సింగ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
లోకేశ్‌కు సీనియర్ మంత్రుల షాక్
-
లోకేశ్‌కు సీనియర్ మంత్రుల షాక్
హైదరాబాద్ : ప్రభుత్వంలో పెత్తనం చలాయించాలనుకుంటున్న చినబాబు(నారా లోకేశ్)కు సీనియర్ మంత్రులు గట్టి షాక్ ఇచ్చారు. మీడియా లైజనింగ్ పేరుతో మంత్రులు, ప్రభుత్వంలో పెత్తనం చలాయించాలనుకున్న ఆయన ప్రయత్నాలకు గండి పడింది. 'మీడియా లైజినింగ్ ఈజ్ నథింగ్ బట్ నిఘా' అని చాలా మంది మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ అధికారుల వ్యవస్థ తమకు సమ్మతం కాదని చాలా మంది సీనియర్ మంత్రులు లోకేశ్ టీమ్‌కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మంత్రుల పేషీల్లో 20 మందిని మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించాలని లోకేశ్ బాబు ప్రతిపాదించారు. అయితే చినబాబు పుట్టకముందు నుంచే పార్టీలో ఉంటున్న తమపై నిఘా ఏంటని సీనియర్ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు మీడియా లైజనింగ్ అధికారుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. 'మా పనికి మేమే పీఆర్వోలమని చాలా మంది చంద్రబాబు ముందుకు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. మరికొంత మంది మంత్రులు సొంత మనుష్యుల్నే పీఆర్వోలుగా పెట్టుకున్నారు. అవసరమైతే వారినే మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించుకోవాలని ప్రతిపాదించారు. మొత్తానికి లోకేశ్ లైజనింగ్ బెడిసి కొడుతోంది. అలాగే సీసీ కెమెరాల ప్రతిపాదనను కూడా మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.