చెన్నై వాసులను ఎలా ఆదుకుందాం?
కనీవినీ ఎరుగని వర్షబీభత్సంతో అతలాకుతలం అవుతున్న చెన్నైలోని పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీనియర్ మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో బిక్కుబిక్కుమంటున్న చెన్నై వాసులను ఆదుకోవడంపై చర్చించారు. చెన్నైలో అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక, రక్షణ చర్యలపై మంత్రులతో మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాసర్వాజ్, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
వర్షాలతో నిండుకుండగా మారిన చెన్నైకి సహాయక బృందాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే జాతీయ విపత్తు సహాయక దళానికి (ఎన్డీఆర్‌ఎఫ్) పది బృందాలను చెన్నైకి తరలించారు. ఆర్మీ, నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇక చెన్నై రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున చిక్కుకున్న ప్రయాణికులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు రైల్వే అధికారి అనిల్ సక్సేనా తెలిపారు. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో చెన్నై వాసుల కష్టాలకు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.