కేంద్రమంత్రి రాధామోహన్ కు వినతిపత్రం అందిస్తున్న ఎంపీ పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: పత్తికి మద్దతు ధర కల్పించి తెలంగాణ రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని కోరా రు. ఈ మేరకు ఆయన గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించకపోవడంతో ఉన్న రుణా లు మాఫీకాక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక పత్తి రైతులు ప్రైవేటుగా అప్పులు తీసుకువచ్చి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగుచేశారని పేర్కొన్నారు. కొద్దిమంది రైతులు మంగళసూత్రాలు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకువచ్చారని అన్నారు.
కరువు కారణంగా పంట రాక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన కొద్దిపాటి పంటకూ గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో కూలీ రేట్లు కూడా రావడం లేదని వాపోయారు. పత్తికి మద్దతు ధర కేవలం రూ. 4,050 ప్రకటించినా కాటన్ కార్పొరేషన్‌కు చెందిన కొనుగోలు కేంద్రాలు ఆ ధర చెల్లించడం లేదని వాపోయారు. ఇప్పటివరకు 350 మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పత్తికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 4050 నుంచి రూ. 5 వేలకు పెంచాలని, కాటన్ కార్పొరేషన్ కేంద్రాలను మరిన్ని పెంచి మద్ధతు ధర కల్పించాలని, మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కేంద్రానికి సూచించారు.