మైసూరు ఫైర్‌బ్రాండ్ ప్రతాపసింహా మరోసారి ట్విట్టర్‌వార్‌కు తెరతీశారు. గతంలో డీఐజీ రూప, ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌లతో ఆయన ట్విట్టర్‌లో ఘాటైన వ్యాఖ్యలతో తలపడడం తెలిసిందే. మైసూరు జిల్లా ఎస్పీ రవి చెన్నణ్ణవర్‌తో హనుమజ్జయంతి ఘటనలపై తనదైన ట్వీట్లు చేయగా, ఎస్పీ కూడా దీటుగా బదులిచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మైసూరు: జిల్లాలోని హుణుసూరులో ఆదివారం హనుమజ్జయంతి ఊరేగింపులో చోటు చేసుకున్న పరిణామాలపై ఎంపీ ప్రతాపసింహా, జిల్లా ఎస్పీ రవి డీ.చెన్నణ్ణవర్‌ల మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం మొదలైంది. ‘పాలించే వారి ఆజ్ఞలు మీరడం సాధ్యం కావట్లేదు కదా’ అంటూ ట్విటర్‌లో ఎంపీ ప్రతాపసింహా ఎస్పీ రవి డీ.చెన్నణ్ణవర్‌పై మొదటగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ‘నిజాయితీ కల అధికారి అనే ముసుగు తీసేసి అధికార పార్టీ బంటునని ఒప్పుకోండి. దత్త జయంతికి అన్ని ఏర్పాట్లు చేసిన చిక్కమగళూరు ఎస్పీ అణ్ణామలైని, ప్రభుత్వాన్నే ఎదిరించిన డీఐజీ రూపాను, మెడికల్ సీట్ల బ్లాకింగ్ బాగోతాన్ని బట్టబయలు చేసిన ఐఏఎస్ రశ్మిను చూసి నేర్చుకోండి, ఇకనైనా మాటలు చాలించండి’ అంటూ ఎంపీ సింహా ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించారు. తమకు తమ రాజకీయ భవిష్యత్తు కంటే తమ మతం సంప్రదాయాలను రక్షించుకోవడమే ముఖ్యమని స్పష్టంచేశారు.
రాజ్యాంగ రక్షణే మా విధి: ఎస్పీ ట్వీట్
ఎంపీ ట్వీట్‌లపై ఎస్పీ రవి చెన్నణ్ణవర్ కూడా తమదైన శైలిలోనే బదులిచ్చారు.‘మేము ఎవరికీ అనుకూలం కాదు, ఎవరికీ వ్యతిరేకులం కాదు, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నాం. మాకు రాజ్యాంగ రక్షణ ముఖ్యం, భారతదేశమే మా మతం. ఎస్పీ అణ్ణామలై నుంచే కాదు కానిస్టేబుల్‌ను చూసి కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో బదులిచ్చారు. సాంకేతికతను, సామాజిక మాధ్యమాలను వివేకంతో వినియోగించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో శాంతి భధ్రతలకు ముప్పు వాటిల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కార్యకర్తల్లో మిమ్మల్ని అనుసరించే, అభిమానించే యువకులు మీ వ్యాఖ్యల ద్వారా మరింత ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment