
కశ్మీర్‌పై స్పష్టమైన విధానమేది?
లోక్‌సభ చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై ఒక సమగ్ర విధానాన్ని తీసుకొచ్చి అక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ పరిణామాలపై లోక్‌సభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘బాధాతప్తమైన హృదయంతో చెబుతున్నా. భారత ప్రభుత్వానికి కశ్మీర్ విషయంలో ఒక స్పష్టమైన విధానం లేదు. ఏదో ఒక చిన్నవిధానం ఎంచుకున్నా అది తాత్కాలికమైందే. కశ్మీర్‌కు దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు, ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికేదీ లేదు.
అందువల్ల భారత ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో వచ్చేందుకు ఇదొక మంచిసమయం. స్వాతంత్య్రం వచ్చినవేళ కశ్మీర్ ప్రజలకు మనం అనేక హామీలిచ్చాం. కానీ వాటిని అమలు చేయలేదు. అది ప్లెబిసైట్ కావొచ్చు. రెఫరెండం కావొచ్చు. అవెందుకు చేయట్లేదో కశ్మీర్ ప్రజలకు చెప్పలేకపోతున్నాం. కశ్మీర్ విషయంలో మన వైఖరి దురదృష్టకరమైంది. అందువల్లే ఇప్పుడు అశాంతి నెలకొంది. ప్రజలు అభద్రతతో ఉన్నారు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య శాండ్‌విచ్‌లా నలిగిపోతున్నారు. దీనికితోడు మరోపక్కన చైనా. అందువల్ల దేశ ప్రయోజనాలదృష్ట్యా కశ్మీర్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా సమగ్ర విధానం రూపొందాలి’’ అని పేర్కొన్నారు.