తుని-కొత్తవలస రైల్వేలైన్‌ సర్వే పూర్తి | MP Vijaysai Reddy Questioned In Rajya Sabha On Tuni-Kothavalasa Railway Line | Sakshi
Sakshi News home page

తుని-కొత్తవలస రైల్వేలైన్‌ సర్వే పూర్తి

Published Fri, Mar 9 2018 8:48 PM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

MP Vijaysai Reddy Questioned In Rajya Sabha On Tuni-Kothavalasa Railway Line - Sakshi

ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : తుని నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మీదుగా కొత్తవలస వరకు సింగిల్‌ లైన్‌ బ్రాడ్‌ గేజ్‌ రైల్వే మార్గం నిర్మాణం కోసం  సర్వే పనులు పూర్తయినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రాజెన్‌ గొహైన్‌ శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్‌ఆర్‌  కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. తుని నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మీదుగా రైల్వే లైన్‌ నిర్మాణానికి సర్వే పనులను 2016-17లో రైల్వే శాఖ మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణానికి 3771.21 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మొత్తంపై వచ్చే రాబడి (రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌) మైనస్‌ 4.14 శాతంగా తేలింది. సర్వే నివేదిక ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

రైతుల ఆదాయం రెట్టింపు కోసం బృహత్తర ప్రణాళికలు
రైతుల ఆదాయం 2022 నాటికల్లా రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధన కోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి  రాధా మోహన్‌ సింగ్‌ రాజ్య సభలో ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతోందని  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఈ దిశగా సాగిస్తున్న ప్రయత్నాలు, ప్రణాళికలను సోదాహరణంగా వివరించారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఇందుకోసం ఒక వ్యూహాన్ని రూపొందించడానికి ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లోనే నేషనల్‌ రెయిన్‌ఫెడ్‌ ఏరియా సీఈవో అధ్యక్షతన మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ దఫదఫాలుగా ఇప్పటి వరకు తొమ్మిది నివేదికలను సమర్పించిందని, ఆ నివేదికల ఆధారంగా ఇప్పటికే పలు చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్య సాధన దిశగా తీసుకుంటున్న అనేక చర్యలను మంత్రి వివరించారు. అందులో వ్యవసాయోత్పత్తులకు గిరాకీతోపాటు గిట్టుబాటు ధర లభించే వాతావరణం కల్పించేందుకు సమగ్రమైన స్టేట్ మార్కెట్ చట్టం తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే సీజన్‌కు ముందే రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకునేలా ఒక మోడల్‌ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు మంత్రి చెప్పారు.

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, డిమాండ్‌ను ముందుగానే పసిగట్టే విధంగా టెక్నాలజీని వ్యవస్థను రూపుదిద్దడానికి డైరెక్టరేట్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్పెక్షన్‌ను పునఃవ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. అయిదేళ్ళలో ఏటా 24 మిలియన్‌ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పాదన లక్ష్యం సాధించేందుకు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం. నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కూడా సమగ్రమైన ప్రణాళికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు మంత్రి వివరించారు.

వ్యవసాయ, వ్యవసాయ సంబంధింత రంగాల కార్యకలాపాలను, రైతుల సంక్షేమాన్ని సమగ్రంగా సమీక్షించేందకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సంస్థాగతమైన వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నాం. వచ్చే మూడేళ్ళ కాలంలో దేశంలోని అన్ని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌)ను కంప్యూటరీకరణ చేయడానికి బడ్జెట్‌లో తగిన కేటాయింపులు. రైతులు తమ ఉత్పాదనలను నేరుగా విక్రయాలు జరుపుకోవడానికి వీలుగా వచ్చే మూడేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా 22 వేల గ్రామీణ సంతలను దశల వారీగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి ప్రాధాన్యత నుంచి ఆదాయం సమకూర్చే వనరుగా మార్పులు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

కరువు నుంచి ఉపశమనం కోసం ఐఫాడ్‌తో ఏపీ ఒప్పందం
కరువు నుంచి ఉపశమనం కోసం ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ (ఐఫాడ్‌)తో ఒప్పంద కుదుర్చుకున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి  గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్య సభలో వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక జవాబిస్తూ, 2017 సెప్టెంబర్‌ నుంచి 2022 సెప్టెంబర్‌ వరకు అయిదేళ్ళపాటు ఈ ప్రాజెక్ట్‌ అమలులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో  తీవ్ర కరువు, వర్షాభావంతో తల్లడిల్లే అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్‌ అమలు అవుతుందని చెప్పారు. ఆయా జిల్లాల్లోని ఒక లక్షా 65 వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాల ఆదాయ వనరులను మెరుగుపరుస్తూ, కరువు పరిస్థితులను దీటుగా ఎదుర్కోగల సామర్ధ్యం వారిలో కలిగించడం ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశంగా మంత్రి వివరించారు.

ఈ ప్రాజెక్ట్‌ కోసం అయ్యే మొత్తం వ్యయం 1042 కోట్ల రూపాయల నిధులను ఐఫాడ్‌తోపాటు, నాబార్డ్‌ ఆధ్వర్యంలోని గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌), ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్రీయ క్రిషి వికాస్‌ యోజన నుంచి సమకూర్చడం జరుగుతుందని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో ఐఫాడ్‌ ఒక్కటే 528 కోట్ల రూపాయలు భరిస్తుంది. ఆర్‌ఐడీఎఫ్‌ 43.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 96.9 కోట్లు, ఉపాధి హామీ పథకం, కృషి వికాస్‌ యోజన నుంచి 311.53 కోట్లు, లబ్దిదారుల వాటాగా 61.47 కోట్ల రూపాయల చొప్పున నిధుల సమీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ అమలు తీరును గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement