
రేపటి నుంచి ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ ఆందోళన
25 రోజులపాటు నిరసన: మందకృష్ణ మాదిగ
సాక్షి, న్యూఢిల్లీ : మంగళవారం నుంచి ఆగస్టు 12 వరకు 25 రోజులపాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు.
అలాగే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జూలై 19 నుంచి ఆగస్టు 12 వరకు జంతర్‌మంతర్ వద్ద మహా ప్రదర్శన, ధర్నాలు, దీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జూలై 19న మాదిగ కళామండలి వేల డ ప్పులు-వేల గొంతుల మహా ప్రదర్శన, అనంతరం విభాగాల వారీగా జాతీయ, రాష్ట్ర, జిల్లా మండలి కమిటీల నాయకులు, వారి కుటుంబసభ్యులతో మహాధర్నా, నిరసన చేపట్టనున్నట్లు ప్రకటనలో వివరించారు.