ఎన్నికల విధుల్లో స్కూలు బస్సులు
అందుబాటులో సుమారు 1000 వాహనాలు
* రెండు రోజుల పాటు ఆర్టీసీ ఆధీనంలోనే...
* 13వ తేదీనుంచే దీపావళి సెలవులు ప్రకటించిన ఎక్కువ శాతం స్కూళ్లు
సాక్షి, ముంబై: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు దాదాపు 1,000 పాఠశాల బస్సులను ఉపయోగించనున్నారు. ఈ బస్సుల్లో దాదాపు 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులను మంగళ, బుధవారాల్లో విధులకు చేరవేయనున్నారు. సిబ్బందిని చేరవేసే బాధ్యతను వారికి రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ అప్పగించింది.
ఈ బస్సుల్లో బ్యాలెట్ బాక్సులు, పత్రాలతోపాటు ఓటింగ్‌కు అవసరమున్న ఇతర సామగ్రి స్టాంపులు, ఇంక్‌లు కూడా తరలించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నగరంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 తేదీన బంద్ చేయగా కొన్ని పాఠశాలలు మాత్రమే 14వ తేదీన నడువనున్నట్లు అధికారి తెలిపారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలలు ఆ రోజు పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఒక్క రోజు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు మరో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
ఆర్టీవో అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధుల కోసం బస్సులను అందించాల్సిందిగా ఈ నెల 9వ తేదీన అన్ని పాఠశాలలు అదేవిధంగా స్కూల్ బస్ అసోసియేషన్లకు సర్క్యూలర్ జారీ చేశామన్నారు. అద్దె స్కూల్ బస్సులే కాకుండా పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులను కూడా ఎన్నికల నిమిత్తం అందించాలని కోరామన్నారు. కాగా ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి బస్సులు విద్యార్థుల కోసం అందుబాటులో ఉండవని అధికారి ఒకరు తేల్చి చెప్పారు. అంతేకాకుండా కొన్ని స్టేట్ బోర్డ్ పాఠశాలలను కూడా ఓటింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారన్నారు. దీంతో 14వ తేదీన కూడా కొన్ని పాఠశాలలను బంద్ చేయనున్నారు. అయితే కొన్ని పాఠశాలలు ఈ నెల 13వ తేదీ నుంచి దీపావళి సెలవులను ప్రకటించాయి.
ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ కి చెందిన కొన్ని పాఠశాలలు మిడ్ టర్మ్ పరీక్షలను ఇంతకు ముందే పూర్తి చేశాయి. ప్రస్తుతం బోధనా క్లాసులను నిర్వహిస్తున్నారు. బస్సుల కొరత వల్ల తాము పాఠశాలలను మూసి ఉంచబోమని అంధేరిలోని రాజ్‌హన్స్ విద్యాలయ ప్రిన్సిపల్ దీప్షిక శ్రీవాస్తవ్ తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తమ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సహకరిస్తారని చెప్పారు. వారు తమ పిల్లలనుపాఠశాలలకు పంపించేందుకు ప్రత్నామ్నాయం చూసుకుంటారని తెలిపారు.
ఇదిలా ఉండగా, కానీ కొన్ని స్టేట్ బోర్ట్ పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 14వ తేదీన బస్సులు నడవవని ముందే సమాచారం ఉన్నందున తాము 9వ, 10వ తరగతులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్‌వీపీ స్కూల్ ప్రిన్సిపల్ సంగీత శ్రీవాస్తవ్ తెలిపారు. దీంతో తాము ఇతర రవాణాను చూసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు కోరామన్నారు. అయితే చిన్న పిల్లలకు మాత్రం సెలవు ప్రకటించినట్లు శ్రీవాస్తవ్ పేర్కొన్నారు.