
ఆవు దూడకు ఘనంగా ముస్లిం ఫ్యామిలీ బర్త్ డే
మీరట్: గోహత్యలకు సంబంధించిన ఘటనలతో దేశ వ్యాప్తంగా అలజడులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఓ ముస్లిం కుటుంబం ఆవు దూడకు పుట్టిన రోజు వేడుకలు జరిపి అందరినీ ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్లోని 'దాద్రీ'లో ఆవుమాంసం వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, అదే రాష్ట్రంలో మీరట్లోని సికిందర్ కాలనీకి చెందిన ఓ ముస్లిం కుటుంబం ఆవులను తమ సొంత కుటుంబసభ్యులుగా చూస్తూ ఓ దూడకు జన్మదిన వేడుకలు జరిపింది.
మీరట్లోని మహమ్మద్ ఇర్షాద్ కుటుంబానికి 'జూలి' అనే సంవత్సరం వయసున్న ఆవుదూడ ఉంది. దానికి పుట్టిన రోజు వేడుకలు జరపాలని నిర్ణయించి ఆ వేడుకలకు 100 మంది అతిధులను కూడా ఆహ్వానించారు. వేడుకకు ప్రత్యేకంగా 10 కిలోల ఎగ్లెస్ వెనీలా కేక్ను ఆర్డర్ చేసి తెప్పించారు. జూలీకి పుట్టిన రోజు వేడుకలలో బర్త్డే టోపీని కూడా అలంకరించారు. ఈ వేడుకకు హాజరైన ఇర్షాద్ మిత్రులు, బంధువులు జూలీకి పుట్టినరోజు బహుమతులుగా పండ్లను తీసుకొచ్చారు. ఈ వేడుకల కోసం ఆ కుటుంబం ఏకంగా రూ. 40 వేలు ఖర్చుచేసింది. ఇర్షాద్ కుటుంబం గత 40 సంవత్సరాలుగా ఆవులను కలిగి ఉంది. ఇస్మాయిల్ తండ్రి హాజీ అబ్ధుల్ గని.. గోవులపై ఇష్టంతో వాటికి పుట్టినరోజు వేడుకలు జరిపే సాంప్రదాయాన్ని ప్రారంభించారు.