భారీ వర్షాలు.. గురుద్వారాలో బక్రీద్ ప్రార్థనలు
సాక్షి, డెహ్రాడూన్: ఈద్-అల్-అదా(బక్రీద్) సందర్భంగా దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రార్థనలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్ లో మాత్రం ఓ భిన్నమైన దృశ్యం దర్శనమిచ్చింది. ఛమోలి జిల్లా జోషిమఠ్ లోని ఓ గురుద్వారాలో నమాజ్ నిర్వహించటం ద్వారా ఆకట్టుకున్నారు నిర్వాహకులు.
నిజానికి వారంతా గాంధీ మైదాన్‌లో ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు ఆటంకం కలిగించాయి. దీంతో వందల మంది ఇలా గురుద్వారాలో నిర్వహించిన నమాజ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
భిన్నత్వంలో ఏకత్వం ,శాంతి, సామరస్యం, ప్రేమ, స్నేహం ఇవన్నీ మానవత్వానికి ప్రతిరూపాలే. మతాలు ఎన్ని అయినా దేవుడు ఒక్కడే .. ఏ దేవుడు అయినా.. ఏ ధర్మం ఆయినా మనకు చెప్పేది నీతి ఒక్కటే.. అదే సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం. మతం, కులం మన సంస్కృతిలో భాగం కాదు. ఒక కాలానికి అనువుగా గీసుకున్న విభజన రేఖ అది. అయినా పట్టింపులు లేని నేటి కాలానికి మతం రంగు పులమటం అనేది హాస్యాస్పదమే అనుకోవాలి. ఏది ఏమైనా మన సంస్కృతి మాత్రం చాలా గొప్పది.
