
‘భారత్’ను రక్షించాల్సిన అవసరం ఉంది’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సున్నిత విమర్శలు చేశారు. భారతదేశం అనే భావనను ప్రస్తుత ప్రభుత్వం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం తిరోగమన పరిస్థితుల్లో ఉందని, అది కూడా కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమితమైకాక శాంతియుత పరిస్థితులకు, భిన్నత్వ భావనకు పాకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అసలైన భావనను తుడిచేయాలనుకుంటున్న వారి నుంచి భారత్‌ను రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళవారం కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేతలతో(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)తో ఢిల్లీలో అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఆమె ఈ సందర్భంగా వారితో పలు విషయాలు చర్చించారు.
‘ఒకప్పుడు ఎక్కడైతే సామరస్యం ఉందో అక్కడ నేడు అది కనిపించకుండా పోతోంది. ఎక్కడైతే ఆర్థికసామర్థ్యం ఉందో ఇప్పుడక్కడ స్తబ్ధత నెలకొంది. ఒకప్పుడు ఎక్కడ సహనం ఉందో ఇప్పుడు అక్కడ రెచ్చగొట్టుతత్వం ఏర్పడుతోంది. అందుకే భారతదేశం అసలు ఏ భావనతో ఏర్పడిందో దానిని మనం ఇప్పుడు తప్పకుండా రక్షించాల్సినవసరం ఉంది’ అని సోనియా గాంధీ తమ పార్టీ నేతలకు సూచించారు. ఇక 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎవరికీ వారుగా వ్యక్తిగత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.