'సీఎంను ఓడించడమే నా లక్ష్యం'
పట్నా: బిహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఓడించడమే తమ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా(హమ్) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ వ్యాఖ్యానించారు. మరోసారి తాను గెలుపొంది సీఎం అయితే.. బిహార్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు. బీజేపీ సెక్యూలర్ పార్టీ కాదన్న మహాకూటమి వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 1990 దశకంలో బీజేపీ మద్దతుతోనే లాలూ గద్దెనెక్కిన సమయంలో ఆ పార్టీ సెక్యూలర్ అయినప్పుడు.. ఇప్పుడు ఏ అర్హతతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏపై విమర్శలు చేస్తారంటూ మాంఝీ మండిపడ్డారు.
హమ్ పార్టీ... ఎన్డీఏ మిత్రపక్షంగా ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మహాకూటమిగా ఉన్న కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీలను దెబ్బతీసి నితీష్ను ఓడించడమే తన ముందున్న లక్ష్యమని మాంఝీ అన్నారు. తన నుంచి అధికారం చేజిక్కించుకోగానే నితీష్ తన నిర్ణయాలను రద్దుచేసి, వాటినే తన సొంత నిర్ణయాలు, విధానాలుగా ప్రకటించుకున్నారంటూ మాంఝీ నిప్పులు చెరిగారు. బీజేపీ మిత్ర కూటమి 243 స్థానాలకు గానూ 180 సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. హిందుస్తానీ అవామ్ మోర్చా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 20 స్థానాల్లోనూ గెలుపొందుతామని ధీమా వ్యక్తంచేశారు.
2014, మే నెలలో మాంఝీ సీఎం అయిన విషయం విదితమే. ఆ తర్వాత మాంఝీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నితీష్ తన మద్ధతు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్తో చేతులు కలిసి బిహార్ సీఎంగా నితీష్ మళ్లీ గద్దెనెక్కారు.