‘మహా’ ప్రచారానికి స్టార్ క్యాంపైనర్స్
ముంబై: ఈ నెల 15వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగనున్న ప్రచార సభల్లో ఆయా పార్టీల అతిరథమహారథులు పాల్గొననున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నందున జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అధినేతలను వీలైనన్ని ప్రచార సభల్లో పాల్గొనెలా చేసి లబ్ధిపొందాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
అలాగే ఆయా పార్టీలకు చెందిన ‘స్టార్ కేంపైనర్స్’ పాల్గొననున్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం అందించిన సమాచారం మేరకు.. 54 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల లిస్ట్‌ను బీజేపీ అందజేసింది. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.అలాగే బాలీవుడ్ నటులు, పార్టీ ఎంపీలు అయిన హేమామాలిని, పరేష్ రావల్, వినోద్ ఖన్నా, బబుల్ సుప్రియోల సేవలు కూడా వినియోగించుకోనున్నారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ జ్యోతిరాదిత్య, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, నటి నగ్మా తదితరులు ప్రచార సభల్లో స్టార్ ప్రచారకులుగా పాల్గొననున్నారు. అలాగే శివసేన తరఫున పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే, నటుడు అమోల్ కోహ్లీ, టీవీ నటుడు ఆదేశ్‌బండేకర్ సహా 36 మంది ప్రచారసభల్లో ‘స్టార్ క్యాంపైనర్లు’గా పాల్గొననున్నారు. లెఫ్ట్ పార్టీ తరఫున పదిమంది ప్రచారకులు పాల్గొననుండగా వారిలో ఎ.బి. బర్దన్ కూడా ఉన్నారు.
అలాగే రాష్ట్రీయ సమాజ్ పార్టీ తరఫున మహదేవ్ జంకార్ సహా 11 మంది ప్రచారసభల్లో పాల్గొననున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ తరఫున పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఎమ్మెన్నెస్ తరఫున ఆ పార్టీ అధినేత రాజ్‌ఠాక్రేతోపాటు 16 మంది నేతలు ప్రచార బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 45 స్థానాలకు పోటీచేస్తున్న గరీబ్ ఆద్మీపార్టీ తరఫున ఆపార్టీ కన్వీనర్ శ్యాం భరద్వాజ ‘స్టార్ క్యాంపైనర్’గా ప్రచార సభల్లో పాల్గొననున్నారు.