
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని పార్టీ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు తెలిసింది. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావు, గరికపాటి మోహన్‌రావు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఎంపీలు ప్రధానికి వివరించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఎంపీలు వివరిస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపు అని ప్రధాని చెప్పినట్టు సమాచారం. 15 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని ఆరా తీసినట్టు తెలిసింది. పార్లమెంట్ సమావేశాల్లో పౌరసత్వం సవరణ బిల్లుకు టీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వకపోవడాన్ని ఎంపీలు ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రధాని ఆరా తీసినట్టు సమాచారం. సమావేశం సందర్భంగా ప్రధాని మోదీకి ఎంపీ సోయం బాపురావు సమ్మక్క–సారలమ్మ ప్రసాదాన్ని అందజేశారు.
ప్రధాని వద్ద క్షేత్రస్థాయి నివేదికలు..
తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రధాని బలంగా విశ్వసిస్తున్నారని, ఆయన గాలి మాటలు చెప్పే మనిషి కాదని ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఆయన దగ్గర క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నాయి కాబట్టే తెలంగాణలో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని అన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment