రోడ్డు కాదు.. అభివృద్ధికి రాజమార్గం
మీరట్: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే రహదారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. 7,500 కోట్ల భారీ వ్యయంతో 14 లేన్లతో నిర్మించనున్న ఈ రహదారిని అభివృద్ధికి రాజమార్గంగా ప్రధాని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేలా ఆధునిక పద్ధతిలో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో మీరట్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనించాలంటే చక్కని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. వేగవంతమైన రవాణా సౌకర్యాల ద్వారా మౌలిక వసతులు సైతం వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామసడక్ యోజన కార్యక్రమం ద్వారా మాజీ ప్రధాని వాజ్పేయి రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని విమర్శించారు. ఎక్స్ప్రెస్ వే ద్వారా మీరట్ నుంచి ఢిల్లీ మధ్య 70 కిలోమీటర్ల దూరం ఉన్నా.. కేవలం 40 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.