మోదీ ఆలోచనంతా బడా వ్యాపారుల కోసమే: హజారే
బడా పారిశ్రామికవేత్తల బాగోగుల కోసమే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారని అవినీతి వ్యతిరేక ఉద్యకారుడు అన్నా హజారే ఆరోపించారు. ఆయన బడుగులను, రైతులను పక్కకు పెట్టి బడా వ్యాపారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారీ సంఖ్యలో రైతులతో తరలి వెళ్లి ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు.
మంగళవారం తన సొంత గ్రామం రాలేగాం సిద్ధిలో మాట్లాడిన హజారే.. మోదీ హవా కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల సమయంలో దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని మోదీ చెప్పారని, ఆ రోజులు కేవలం పారిశ్రామిక వేత్తల కోసమేనని ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. మోదీ అనుసరిస్తున్న విధానాలవల్ల దేశానికున్న ఖ్యాతి తగ్గనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కొనియాడారు. ఢిల్లీని ఆదర్శ నగరంగా మార్చేందుకు కేజ్రీవాల్ చక్కని విధివిధానాలు రూపొందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమం కోరుకున్నారు కనుకే కేజ్రీవాల్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు.