సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నాయకుడు రవి శంకర్ ప్రసాద్ అన్నారు. బెంగళూరులోని పారిశ్రామికవేత్తలు సైతం మోడీతో అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన ‘పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే పారిశ్రామిక అనుకూల వాతావరణం నెలకొంటుందని భరోసా ఇచ్చారు. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ వృద్ధి రేటు 4.8 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ వృద్ధి రేటు దిగజారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని అన్నారు.
యూపీఏ హయాంలో నెలకొన్న అవినీతి, పాలనా లోపాల వల్ల పరిశ్రమలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి, కుంభకోణాలకు అవకాశం ఇవ్వబోమని తెలిపారు. వాజ్‌పేయి హయాంలో సైతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఎంతో వృద్ధి సాధించారని చెప్పారు. బెంగళూరులో ఎక్కువ స్థానాల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఉత్తమ పాలనకు అవకాశం కల్పించాలని కోరారు. పాలన తమకు కొత్తేమీ కాదని, ఉత్తమ పాలనను అందించిన అనుభవం ఉందని ఆయన తెలిపారు.
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణ పారిశ్రామిక కారిడార్‌లను నిర్మించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీసీ. మోహన్, ఐటీ, బీటీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
మోడీపై పారిశ్రామికవేత్తల ఆశలు
Published Sun, Mar 16 2014 1:38 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement