లక్నో: పారిశ్రామికవేత్తలతో కలిసి ఉంటారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వారితో కలిసుంటే తప్పేమీలేదని.. అందుకు తాను భయపడబోనన్నారు. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలకపాత్ర పోషిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. దేశం 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు విపక్షాలే కారణమని.. వీటికి ఆ పార్టీలే జవాబుదారీ అని విమర్శించారు. ఆదివారం లక్నోలో రూ.60వేల కోట్ల విలువైన 81 పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.
వారు దొంగలు కారు!
పారిశ్రామికవేత్తలను దొంగలు, దోపిడీ దారులంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావని మోదీ అన్నారు. తన ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నందున.. వ్యాపార, పారిశ్రామిక వర్గంతో కలిసి నడవడాన్ని తప్పనుకోవడం లేదన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి కూడా బిర్లా కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండేవని.. అంతమాత్రాన గాంధీ ఉద్దేశాలను తప్పుబట్టలేమన్నారు. ‘రైతులు, బ్యాంకర్లు, ప్రభుత్వోద్యోగులు, కార్మికుల్లాగే.. పారిశ్రామికవేత్తలు కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు.
నన్ను విమర్శించేందుకు కారణాలు వెదుకుతున్న వారు.. 70 ఏళ్లుగా వారు చేసిన తప్పుల వివరాలు వెతుక్కోవాలి’ అని మోదీ విమర్శించారు. ‘ప్రజలతో కలవలేని వారు, తెరవెనుక పనులు చేసేవారు భయపడుతూనే ఉంటారు. కావాలంటే దీనిపై ఇక్కడున్న మాజీ ఎస్పీ నేత అమర్‌సింగ్ పూర్తి వివరాలిస్తారు’ అని మోదీ నవ్వుతూ చెప్పారు. ‘తప్పుడు పనులు చేసేవారు దేశాన్ని వదిలిపెట్టి పోవాలి. లేదంటే జైలు జీవితం గడపాలి. గతంలో అంతా తెరచాటున జరిగేది కాబట్టే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. ఇకపై ఇలాంటివి నడవవు’ అని ప్రధాని స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment