సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు.
అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్‌లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు.
‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్‌ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment