
సరికొత్త శిఖరాలకు...
భారత్, అమెరికా సంబంధాలపై మోదీ, ఒబామా సంకల్పం
పౌర అణు సహకార ఒప్పందంపై ముందుకు..
వాషింగ్టన్: ఒకటి అగ్రదేశం. ప్రపంచ రాజకీయాలను, అంతర్జాతీయ సంబంధాలను కోరుకున్న రీతిలో ప్రభావితం చేయగల దేశం..అమెరికా. మరోటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అన్నింటా అంతర్జాతీయ శక్తిగా ఎదగగల సత్తా ఉందని ప్రపంచమంతా భావిస్తున్న దేశం.. భారత్!
ఈ రెండు ప్రఖ్యాత ప్రజాస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం మంగళవారం వాషింగ్టన్‌లో జరిగింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు, అంతర్జాతీయ అంశాల్లో సహకారాత్మక సంబంధాలను దృఢపర్చుకునేందుకు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక రంగంలో సహకారం, వాణిజ్యం, పెట్టుబడులపై అవగాహనకు వచ్చారు. పశ్చిమాసియాలో పరిసితులతో పాటు ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాదాన్ని అంతమొందించే అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం మోదీ, ఒబామాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విషయంలో కృతనిశ్చయంతో ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఇంధన భద్రత, రక్షణ, మౌలిక వసతులు.. తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని, ఆ ఒప్పందం అమలుకు అడ్డుపడుతున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు ఒబామా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దేందుకు అమెరికా సహకారం అందించనుంది. రక్షణ రంగంలో సహకారాన్ని మరో పదేళ్లు పొడిగించాలని రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి.
సహజ భాగస్వామి యూఎస్: భారత్, యూఎస్‌లు సహజ భాగస్వాములన్న తన విశ్వాసం ఈ పర్యటన ద్వారా మరింత బలపడిందని మోదీ అన్నారు. ‘భారతదేశ లుక్ ఈస్ట్.. లింక్ వెస్ట్ విధానంలో భాగంగా అమెరికాతో సంబంధాలు మాకు చాలా కీలకం’ అన్నారు. ఒబామా కుటుంబాన్ని భారత్‌లో పర్యటించాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. అమెరికా, భారత్‌ల ‘మార్స్’ గ్రహ ప్రయోగాలు విజయవంతమైన సందర్భంలో ఈ భేటీ జరగడం సం తోషంగా ఉందన్నారు. ‘అరుణ గ్రహంపై ఇరుదేశాల శిఖరాగ్ర భేటీ అనంతరం ఇక్కడ భూమిపై ఇప్పుడు ఆ దేశాల నేతల సమావేశం జరుగుతోంది’ అని మోదీ చమత్కరించారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరిం త దృఢపర్చుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయన్నారు. లష్కరే తోయిబా, జెఈఎం, డీ కంపెనీ, అల్‌కాయిదా, హఖ్కానీ గ్రూప్.. తదితర ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసేందుకు రెండు దేశాలు కలసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. ఆ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక, వ్యూహాత్మక సాయం అందకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఒబామా, మోదీ భేటీ అనంతరం పశ్చిమాసియాలో ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏ సంకీర్ణంలోనూ భారత్ చేరబోవడం లేదని భారత అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. పౌర అణు విద్యుత్‌కు సంబంధించి అమెరికా సహకారాన్ని భారత్ కోరుతోందన్నారు. డబ్ల్యూటీవోలో భారత్ వైఖరిని ఒబామాకు స్పష్టం చేశానని మోదీ తెలిపారు. భారతదేశ సేవారంగ కంపెనీలను అమెరికా ఆర్థికవ్యవస్థలో భాగం చేయాలని ఒబామాను కోరానని మోదీ చెప్పారు. భారతదేశ జాతీయ డిఫెన్స్ యూనివర్సిటీలో నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఉండేందుకు అమెరికా అంగీకరించిందన్నారు. అఫ్ఘానిస్థాన్‌కు సహకరించే విషయంలో సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించామన్నారు.
మోదీకి స్పష్టత ఉంది: ఒబామా మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సంబంధించి మోదీకి స్పష్టమైన ఆలోచనలున్నాయని ప్రశంసించారు. భారత్‌నుంచి పేదరికాన్ని పారద్రోలే విషయంలో మోదీ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులపై తామిద్దరం చర్చించామన్నారు. అంతరిక్షం, శాస్త్రీయ పరిశోధనల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని, ఎబోలా తరహా సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మోదీ హిందీలో మాట్లాడగా.. ఆంగ్లంలోకి అనువదించారు.
బ్లెయిర్ హౌస్ టు వైట్‌హౌస్: అంతకు ముందు అమెరికా రక్షణ మంత్రి చుక్ హేగెల్ బ్లెయిర్ హౌస్‌లో మోదీతో సమావేశమై రక్షణ సహకారంపై చర్చించారు. తరువాత ఒబామా తో చర్చల కోసం నేరుగా అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్‌కు మోదీ బయలుదేరారు. నలుపురంగు ఎస్‌యూవీలో.. ఇరువైపులా భారత్, అమెరికా జాతీయ జెండా లు రెపరెపలాడుతుండగా.. మోదీ, తన వెంట వచ్చిన మంత్రులు అధికారుల బృందంతో వైట్‌హౌస్‌కి చేరుకున్నారు.