దౌత్య ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. పర్యటనలైనా, ప్రసంగాలైనా, సమావేశాలైనా, ఒప్పందాలైనా– దేశాల ప్రయోజనాలతో ముడిపడివుంటాయి. సమయం, సందర్భం తప్పనిసరిగా ఉంటాయి. తమ ఆలోచనలేమిటో నిక్కచ్చిగా చెప్పడం కూడా వీటి ఉద్దేశం కావొచ్చు. ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీని పక్కనబెట్టి రష్యాను ఎంచుకున్నారు. రెండు రోజుల ఆ పర్యటన మంగళ వారం ముగియబోతుండగా అమెరికా ప్రాపకంతో 75 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్‌లో మొదలయ్యాయి. ఇవి మూడురోజులపాటు సాగుతాయి.
రష్యా పూర్వరూపమైన సోవియెట్ యూనియన్‌కు వ్యతిరేకంగా నాటో ప్రారంభమైంది. కనుక మోదీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా ఉండొచ్చు. ఈ పర్యటన ‘శాంతి ప్రయత్నాలకు’ తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. పైగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత అత్యంత క్రూరుడైన నేరగాణ్ణి హత్తుకోవటం ఏమిటని విమర్శించారు. జెలెన్‌స్కీ చెబుతున్న శాంతి ప్రయత్నాలేమిటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా రష్యాను ఎదుర్కొనటానికి యుద్ధం మొదలైననాటి నుంచీ ఉక్రెయిన్‌కు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎడాపెడా ఆయుధాలు, డబ్బు సరఫరా చేయటం. అందువల్లే ఆ ఘర్షణ ఎడతెగకుండా సాగుతోంది. ఇందులో శాంతి ప్రసక్తి ఎక్కుడుందో అర్థంకాదు. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఖండించాల్సిందే. కానీ ఇందులో ఉక్రెయిన్ బాధ్యత కూడా ఉంది.
దాని సంగతలావుంచితే భారత–రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానంగా మోదీ రష్యా వెళ్లారు. ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలు కూడా కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందజేశారు. అయితే మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కియూవ్‌లో ఒక ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 37 మంది చనిపోయిన ఉదంతాన్ని ఖండించటానికి మోదీ వెనకాడలేదు. రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిది కాదు. ఆ మైత్రికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. మోదీ అన్నట్టు రష్యా అన్ని కాలాల్లోనూ దృఢంగా మన వెనక నిలబడింది. స్నేహ హస్తం అందించింది. 1971లో పాకిస్తాన్‌తో మనకు యుద్ధం వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదుకుంది.
ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియెట్ పాత్ర కీలకమైనది. మన అమ్ములపొదిలో ఉన్న రక్షణ పరికరాల్లో అత్యధిక భాగం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది కేవలం కొనుగోలుదారు– అమ్మకందారు సంబంధం కాదు. పరిశోధన, అభివృద్ధితో మొదలెట్టి ఉమ్మడి ఉత్పత్తుల వరకూ ఇరు దేశాలూ సహకరించుకుంటున్నాయి. మనకున్న రెండు విమానవాహక నౌకల్లో ఒకటి రష్యానుంచి వచ్చినదే. ఇంకా ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకెఐ యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, ఏకే–203 రైఫిళ్లు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు తదితరాలున్నాయి. ఇవిగాక తన టీ–90 శతఘ్నుల ఉత్పత్తికి మనకు అనుమతులిచ్చింది.
విడి భాగాల దగ్గర్నుంచి నూతన పరిశోధనల వరకూ మన రక్షణ వ్యవస్థ పూర్తిగా రష్యాతో ముడిపడివుంది. అణు విద్యుత్ కర్మాగారాల స్థాపన, నిర్వహణలో తోడ్పడుతోంది. ఇరవై అయిదేళ్ల క్రితం మనకు అమెరికాతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. మనను రష్యాకు దూరం చేయాలని ఆది నుంచీ అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాకైతే ఇది మరింతగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థల్ని బేఖాతరుచేసి ఘర్షణలు నివారించే పేరుమీద అమెరికా ఒక పక్షాన్ని సమర్థించటం, అవతలిపక్షంతో ఎవరూ సాన్నిహిత్యం నెరపకూడదని ఫర్మానా జారీచేయటం ఆశ్చర్యకరం. వాస్తవా ధీన రేఖ వద్ద చైనాతో మనకు అయిదేళ్లుగా లడాయి నడుస్తోంది.
ఆ దేశంతో ఘర్షణలు వస్తే మనకు రష్యా నుంచి రక్షణ పరికరాలు, విడిభాగాలు అత్యవసరమవుతాయి. అంతేకాదు... రక్షణ సాంకేతి కతలు చైనాకు పోకుండా చూడటం మనకు ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలూ వదులుకుని తాను చెప్పినట్టల్లా నడుచుకోవాలని అమెరికా భావించటం ఎంతమాత్రం సరికాదు. పాకిస్తాన్‌తో మనకున్న సమస్యల విషయంలో ఏనాడూ అమెరికా సానుభూతిగా లేదు. కంటితుడుపు చర్యలు తీసుకోవటం, ఏదో వంకన ఆ దేశానికి సైనిక, ఆర్థిక సాయం అందించటం అమెరికాకు రివాజుగా మారింది. మనం మాత్రం తన ఫర్మానాలు పాటించాలని ఆ దేశం ఆశిస్తుంది.
ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి వద్దన్న అమెరికా ఒత్తిడిని కాదని, రోజుకు 21 లక్షల బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం. చౌకగా లభించే ఆ ముడి చమురు వల్ల మనం లాభపడటం మాట అటుంచి ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం సాధించింది. వర్తమాన సంక్లిష్ట పరిస్థితుల్లో రష్యాతో సాన్నిహిత్యం ఇబ్బందికరమే అయినా, దేశ ప్రయోజనాల రీత్యా దాన్ని కొనసాగించాలనుకున్న మన దేశ వైఖరి మెచ్చదగినది. ఏదేమైనా రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను మూడో దేశం ప్రభావితం చేయాలనుకోవటం, వాటిని తెంచుకోవాలని ఒత్తిడి తీసుకురావటం మంచి సంప్రదాయం కాదు. తన పర్యటన ద్వారా అమెరికాకు ఈ సంగతిని స్పష్టం చేసిన ప్రధాని మోదీ చర్య ప్రశంసించదగ్గది.
భారత్–రష్యా సాన్నిహిత్యం
Published Wed, Jul 10 2024 4:35 AM | Last Updated on Wed, Jul 10 2024 4:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment