ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజల్లో పాపులారిటీ మళ్లీ పెరిగింది. ఓ దశలో తగ్గుముఖం పట్టిన ఆయన పాపులారిటీ ఇప్పుడు పెరిగిందని ఈ నెలలో ఇండియా టుడే నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించింది. వచ్చే ఏడాదికి కూడా భారతీయులు ఆయన్నే ప్రధాన మంత్రి పదవికి కోరుకుంటున్నారు.
ఆయన దేశ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశంలో 57 శాతం (పోలింగ్‌లో పాల్గొన్న) ప్రజలు ఆయనకు మద్దతుగా ఓటేయగా, 2015 ఏప్రిల్ నెలలో ఆయన్ని ప్రధాన మంత్రిగా సమర్థించిన వారి సంఖ్య ఊహించని విధంగా 36 శాతానికి పడిపోయింది. మళ్లీ అదే సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఒక్క శాతం పెరిగి 37 శాతానికి పెరిగింది. 2016 సంవత్సరం, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన సర్వేలో ఆయన పాపులారిటీ 40 శాతానికి పెరగ్గా, కేవలం ఆరు నెలల కాలంలోనే ఆయన పాపులారిటీ 50 శాతానికి చేరుకుంది. అంటే దేశంలో 50 శాతం మంది మోదీనే ప్రధానమంత్రి పదవికి తగిన వ్యక్తిగా భావిస్తున్నారు.
నరేంద్రమోదీ తర్వాత ప్రధానమంత్రి పదవికి తగిన వ్యక్తిగా రాహుల్ గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఆయన్ని సమర్థించేవారి సంఖ్య 22 శాతం నుంచి 13 శాతానికి పడిపోయింది. 6 శాతం మంది మద్దతుదారులతో సోనియాగాంధీ మూడో స్థానంలో ఉన్నారు. ప్రధానమంత్రి పదవికి తగిన వ్యక్తిగా 4 శాతం ఓట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మూడోస్థానంలో ఉన్నారు.
నరేంద్ర మోదీ వ్యక్తిగత పాపులారిటీయే కాకుండా కేంద్రంలోని ఆయన ప్రభుత్వం పనితీరుకు కూడా ఎక్కువ మంది ఓట్లు వేశారు. ఇప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 304 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. వాటిలో బీజేపీకి రెండేళ్ల క్రితం 282 సీట్లు రాగా ఈసారి 259 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 145 సీట్లు వస్తాయని వెల్లడైంది. అంటే రెండేళ్ల క్రితం నాటి ఎన్నికల కన్నా మూడు సీట్లు తక్కువ. వాటిలో కాంగ్రెస్పార్టీకి 54 సీట్లు వస్తాయని తేలింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే వచ్చిన విషయం తెల్సిందే.
మోదీ పాపులారిటీ ఇప్పుడు పెరిగినా.. ఇప్పటివరకు దేశంలో ఉత్తమ ప్రధాని ఎవరన్న విషయంలో మాత్రం మోదీ కాస్త వెనకబడి ఉన్నారు. ఇందిరాగాంధీ ఉత్తమ ప్రధాని అంటూ 23 శాతం ఓట్లురాగా, అటల్ బిహారీ వాజపేయికి 18 శాతం, మోదీకి 17 శాతం ఓట్లు వచ్చాయి. నరేంద్ర మోదీకి ఉత్తమ ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు 23 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు 13 శాతం మంది, అరవింద్ కేజ్రివాల్‌కు 12 శాతం మంది, సోనియా గాంధీకి 9 శాతం మంది ఓటేశారు.
మొత్తానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పనితీరు ఎలా ఉందన్న ప్రశ్నకు 44 శాతం మంది బాగుందని, 35 శాతం మంది యావరేజ్‌గా ఉందని చెప్పారు. ఎక్కువ మాట్లాడతారని, కార్యాచరణ ఏమీ ఉండదని 24 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఆయన ఒంటెద్దు పోకడ అని, మైనారిటీలకు వ్యతిరేకమని 9 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.
నరేంద్ర మోదీ పాపులారిటీ మళ్లీ పెరిగింది
Published Sat, Aug 20 2016 6:51 PM | Last Updated on Tue, Aug 21 2018 9:39 PM
Advertisement
Advertisement