'ప్రధాని ఫస్ట్ క్లాస్'
అహ్మదాబాద్: ప్రధాని మోదీ 62.3 శాతం మార్కులతో 1983లో ఎం.ఏ. డిగ్రీ దూరవిద్య ద్వారా ఉత్తీర్ణులయ్యారని గుజరాత్ వర్సిటీ ఆదివారం తెలిపింది. ప్రధాని విద్యార్హతలపై వివాదం నేపథ్యంలో వీసీ ఎం.ఎన్.పటేల్ స్పందించారు. నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్‌లో 800కు గాను 499 మార్కులు సాధించి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఎం.ఏ. తొలి ఏడాదిలో 400కు 237 మార్కులు, రెండో ఏడాదిలో 400కు 262 మార్కులు పొందారని చెప్పారు.
ఇంతవరకూ తమకు కేంద్ర సమాచార సంఘం(సీఐసీ) ఆదేశాలు అందలేదని, మీడియా ద్వారానే వివరాలు తెలిశాయన్నారు. ఆదేశాలు వస్తే సంబంధిత సమాచారం దరఖాస్తుదారుడికి అందిస్తామన్నారు. 20 ఏళ్లు దాటితే వివరాలు అందించలేమని, మోదీ బీఏపై తమ వద్ద వివరాలు లేవన్నారు.
ఓటరు గుర్తింపు ధ్రువపత్ర వివరాలు ఇవ్వాలన్న సీఐసీ ఆర్టీఐ దరఖాస్తుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. సమాచారం ఇవ్వడానికి సిద్ధమేనని, అయితే ప్రధాని విద్యార్హత వివరాల్ని సీఐసీ తెలపాలన్నారు. కేజ్రీవాల్ లేఖనే దరఖాస్తుగా పరిగణించిన సీఐసీ... ప్రధాని డిగ్రీ వివరాలు ఇవ్వాలంటూ ఢిల్లీ, గుజరాత్, ప్రధాని కార్యాలయాలను శుక్రవారం ఆదేశాలిచ్చింది.