సొంత రాష్ట్రానికి మోడీ గుడ్బై
సొంత రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టాటా చెప్పేశారు. తనను భారీ మెజారిటీతో గెలిచిపించిన వడోదర ప్రజలకు గుడ్బై చెప్పారు. దాదాపు 5.40 లక్షల మెజారిటీతో గెలిచిన వడోదర లోక్సభ స్థానానికి నరేంద్ర మోడీ గురువారం నాడు రాజీనామా చేశారు. గుజరాత్లోని వడోదరతో పాటు.. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి కూడా మోడీ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. రెండింటిలో ఏదో ఒకటే స్థానాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వారణాసి ఎంపీ పదవిని అట్టిపెట్టుకుని, వడోదరకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే, తనను రికార్డు మెజారిటీతో గెలిపించిన వడోదర స్థానంలో అభ్యర్థిగా ఆయన ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ మాజీ హోం మంత్రి, మోడీకి అత్యంత సన్నిహితుడు, ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 78 ఎంపీ స్థానాలు అందించిన అమిత్ షా ఇక్కడినుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. లేనిపక్షంలో.. అటు లోక్సభ, ఇటు రాజ్యసభ రెండింటిలోనూ సభ్యత్వం లేకపోయినా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన స్మృతి ఇరానీ లేదా నిర్మలా సీతారామన్ ఇద్దరిలో ఒకరికైనా అవకాశం ఇవ్వచ్చని చెబుతున్నారు.