'అమిత్ షా'కు బీజేపీ సారథ్య బాధ్యతలు?
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్‌షాకు దక్కనున్నట్లు సమాచారం. ఆయనకు జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు కట్టబెట్టేందుకు పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అమిత్ షా పేరును ఖరారు చేయనునట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్‌షాకు అధ్యక్షపదవిని కట్టబెట్టే విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) కూడా సముఖంగానే ఉంది. దాంతో పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఆయన ముందు వరసలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించి పెట్టిన అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా 80 సీట్లకుగానూ 71 స్థానాల్లో విజయం సాధించి పెట్టారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానాతోపాటు వచ్చే ఏడాది ఆరంభంలో జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ పరంపరను కొనసాగించడానికి అమిత్‌షాకే పగ్గాలు ఇవ్వాలని పార్టీ భావించింది.