వాజ్ పేయితో నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయికి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ పర్యటన నుంచి ఢిల్లీ తిరిగొచ్చిన మోదీ.. విమానాశ్రయం నుంచి నేరుగా వాజ్పేయి నివాసానికి వెళ్లారు. ఈ రోజు వాజ్ పేయి 91వ జన్మదినం. వాజ్ పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వాజ్ పేయి నివాసంలో కాసేపు గడిపారు. అనంతరం మోదీ తన నివాసానికి బయల్దేరి వెళ్లారు. పాకిస్తాన్ పర్యటనలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్.. వాజ్ పేయితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారని మోదీ ట్వీట్ చేశారు. పాక్ ప్రధాని తన తరపున వాజ్ పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాల్సిందిగా కోరారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. వాజ్పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయు ఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండునూరేళ్లు జీవించాలని రాష్ట్రపతి ట్వీట్టర్ సందేశంలో ఆకాంక్షించారు. వాజ్ పేయికి బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా వాజ్పేయి మంచానికే పరిమితమయ్యారు.