మోదీ సిక్సర్! | Narendra Modi's Independence Day speech highlights | Sakshi
Sakshi News home page

మోదీ సిక్సర్!

Published Tue, Aug 16 2016 2:41 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

మోదీ సిక్సర్! - Sakshi

మోదీ సిక్సర్!

బాల్‌ ‘బౌండరీ’ దాటింది
పాకిస్తాన్‌పై గురిచూసి కొట్టిన ప్రధాని


సాక్షి, న్యూఢిల్లీ: దేశ విదేశాంగ విధానంలో సరికొత్త పంథాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెరలేపారు. సోమవారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వేదికగా.. ఢిల్లీలోని ఎర్రకోట మీద నుంచి చేసిన ప్రసంగంలో.. పాకిస్తాన్‌లో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జిల్‌జిత్‌లో ప్రజల అణచివేత అంశాన్ని ఆయన లేవనెత్తారు. ‘‘పొరుగున ఉన్న దేశానికి ఒక్కటే చెబుతున్నా.. ఒకరితో ఒకరు పోరాడడం కన్నా.. ఇద్దరి సమస్య అయిన పేదరికంపై కలసి పోరాడుదాం. అప్పుడే ఇద్దరం సుసంపన్నమవుతాం. పేదరికం నుంచి విముక్తి పొంద డం కంటే ప్రపంచంలో మరే పెద్ద స్వాతంత్య్రం లేదు. ఎర్రకోట బురుజుల మీద నుంచి నేను కొంతమందికి– బెలూచిస్తాన్, జిల్‌జిత్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ల ప్రజలకు– కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నాను.

వారి సమస్యలపై దృష్టి సారించినందుకు నాకు వారు ఇటీవల కృతజ్ఞతలు తెలిపారు. ఇది 125 కోట్ల భారత ప్రజలకు దక్కిన అరుదైన గౌరవం’’ అని మోదీ పేర్కొన్నారు. ఇంతకాలం భారత విదేశాంగ విధానంలో.. పొరుగు దేశం, అందునా పాకిస్తాన్‌ అంతర్గత విషయాలను ప్రస్తావించటం లేనేలేదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించటమూ వ్యూహాత్మక చర్చలకే పరిమితం. అన్నిటికీమించి ఒక ప్రధాని భారత స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పాక్‌ నియంత్రణలోని భూభాగం గురించి మాట్లాడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ.. భారత్‌లో భాగంగా ఉన్న కశ్మీర్‌ విషయాన్ని.. అక్కడ అలజడుల అంశాలను పాక్‌ పదే పదే లేవనెత్తుతుండటం.. దానికి భారత్‌ అభ్యం తరం వ్యక్తం చేయటం జరిగేది. మోదీ పీవోకేలోని ప్రజల గురించి, పాక్‌లో బెలూచిస్తాన్‌ గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు.. భారత్‌ – పాక్‌ సంబంధాల్లో దీర్ఘకాలంగా కొనసాగతున్న ముసుగులో గుద్దులాటకు ముగింపు పలికాయని పరిశీలకులు భావిస్తున్నారు.

పాక్‌పై ఆయుధంగా బెలూచిస్తాన్‌...
అలాగే.. పాక్‌లోని బెలూచిస్తాన్‌ గురించి మోదీ ప్రస్తావించటం మరో వ్యూహాత్మక ఎత్తుగడగా పేర్కొంటున్నారు. పాక్‌లోని 4 రాష్ట్రాల్లో బెలూచిస్తాన్‌ ఒకటి. నైరుతి మూలన ఉన్న ఈ రాష్ట్రంలో బలూచ్‌ జాతి ప్రజలు దశాబ్దాలుగా పాక్‌ నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. (అటు ఇరాన్, అఫ్గానిస్తాన్‌లలో సరిహద్దుల ప్రాంతాల్లోనూ బలూచ్‌ ప్రజలు ఈ తరహా పోరాటాలు చేస్తున్నారు.) 1948 నుంచే బెలూచిస్తాన్‌లో మొదలైన ఈ అంతర్యుద్ధం.. గత దశాబ్దంలో ఉధృతరూపం దాల్చింది. ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్‌ మద్దతిచ్చి పెంచిపోషిస్తోందని పాక్‌ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని భారత్‌ డిమాండ్‌ చేయగా.. పాక్‌ ఎన్నడూ ఆధారాలేవీ చూపలేకపోయింది. అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో అలజడులను ప్రస్తావిస్తూ.. అక్కడ ప్రజల హక్కులను భారత్‌ కాలరాస్తోందంటూ అంతర్జాతీయంగా నిందలు వేయటానికి పాక్‌ వాడుకుంటోంది. 

ఇప్పుడు మోదీ బెలూచిస్తాన్‌ విషయాన్ని ప్రస్తావించటం ద్వారా.. పాక్‌ను అంతర్జాతీయ వేది కపై దోషిగా నిలబెట్టటానికి ఆ దేశంలో మాన వ హక్కుల అణచివేతను మరొక ఆయుధంగా వినియోగించుకునే వ్యూహానికి పదునుపెట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇక మరొకవైపు చైనా కూడా కశ్మీర్‌లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. పాక్, చైనాలు రెండూ.. తాము ఆక్రమించుకున్న కశ్మీర్‌ భూభాగాలను కలుపుకుంటూ ఎకానమిక్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న విషయ మూ విదితమే. ఈ నేపథ్యంలో ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజల అణచివేత అంశాలను ప్రముఖం గా ప్రస్తావించటం ద్వారా.. ఆ రెండు దేశాల వ్యవహారాన్ని తాము తేలికగా తీసుకోవటం లేదని మోదీ పరోక్షంగా హెచ్చరించినట్లు కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అక్కడ ఉగ్రవాదాన్ని కీర్తిస్తారు
పొరుగుదేశం ఉగ్రవాదులను అమరవీరులుగా కొనియాడుతోందంటూ మోదీ తన ప్రసంగంలో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపైనా సునిశిత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘పెషావర్‌లో ఒక స్కూల్‌పై ఉగ్రవాద దాడిలో (రెండేళ్ల కిందట) చిన్నారులు మరణించినపుడు.. మా పార్లమెంటులో కన్నీళ్లు ఉబికాయి. భారత చిన్నారులు కలతచెందారు. ఇది మన మానవత్వానికి ఉదాహరణ. కానీ అవతలివైపు చూడం డి.. అక్కడ ఉగ్రవాదాన్ని కీర్తిస్తారు’’ అంటూ ఇటీవల కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ కమాం డర్‌ బుర్హాన్‌ వానిని పాక్‌ అమరవీరుడుగా కీర్తిస్తున్న విషయాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. భారత్‌ ఉగ్రవాదానికి, హింసకు తల వంచదన్నారు. ‘‘హింసామార్గం ఎవరికీ ఎన్న డూ ప్రయోజనం కలిగించలేదు. ఆ యువతకు నేను చెప్తున్నాను.. ఇంకా సమయం ఉంది.. వచ్చి ప్రధాన స్రవంతిలో కలవండి. మీ తల్లిదండ్రుల ఆకాంక్షలను సాకారం చేయండి. శాం తియుత జీవనం గడపండి’’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు కశ్మీరీ యువతను ఉద్దేశించి చేసినవిగా పరిశీలకులు భావిస్తున్నారు.

ఇక పాక్‌పై ఎదురుదాడి వ్యూహం
ఇప్పటివరకూ భారత్‌ తనలో భాగంగా ఉన్న కశ్మీర్‌ గురించే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) గురించి మాట్లాడటం అరుదు. వాస్తవానికి భారత్‌ – పాక్‌ల మధ్య కార్గిల్‌ వంటి తీవ్ర ఘర్షణల సమయంలో సైతం భారత్‌ అధీనరేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌)ను దాటలేదు. ఇందుకు కారణం.. ప్రాంతీయ సుస్థిరతకు భారత్‌ అధిక ప్రాధాన్యం ఇవ్వడమే. అయితే.. పాక్‌ అనునిత్యం భారత్‌లోని కశ్మీర్‌ గురించి అంతర్జాతీయంగా లేవనెత్తుతూ భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో  పీవోకే అంశాన్ని ప్రస్తావిస్తూ.. జిల్‌జిత్‌ తదితర ప్రాంతాల ప్రజల అణచివేతను ప్రస్తావించటం భారత వైఖరిలో స్పష్టమైన మార్పుకు తెరతీసినట్లయింది. కశ్మీర్‌ అంటే తమ భూభాగంలో ఉన్నదే కాదని.. పాక్‌ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌నూ కలుపుకొని మాట్లాడతామని మోదీ స్పష్టం చేసినట్లయింది. దీంతో కశ్మీర్‌పై ఇప్పటివరకూ ఆత్మరక్షణ వైఖరిగా ఉన్నట్లు కనిపించే భారత విధానం.. ఎదురుదాడి వ్యూహానికి మారినట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement