18 భాషల్లో మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన దైనశైలిలో ప్రత్యేకతను చాటుకున్నారు. తెల్లటి దుస్తులు, తెల్ల గెడ్డం, ఎర్రటి తలపాగాతో వచ్చిన మోడీ .. శుక్రవారం నాడు ఎర్రకోటపై 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాధారంగా అయితే రెండు మూడు భాషల్లోనే దేశ ప్రజలకు అభినందనలు తెలియజేయటం ఇప్పటి వరకూ చూసి ఉంటాం. అయితే మోడీ మాత్రం 18 భాషల్లో దేశ ప్రజలకు అభినందనలు తెలిపి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.
అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్, మన జాతీయ భాష అయిన హిందీతో పాటు మరో పదహారు భాషల్లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు నమ్మకం కలిగించేలా పరిపాలన అందించడానికి కృషి చేస్తానని మోడీ హామీ ఇచ్చారు. యావత్ భారతావని వృద్ధి బాటలో పయనించాలని కోరుతూ.. ప్రతీ ఒక్క భారతీయుడు వర్ధిల్లాలని మోడీ తన ప్రసంగంలో ఆకాంక్షించారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన ఓ బాలకుడు ఈ రోజు ఎర్రకోట నుంచి భారత త్రివర్ణ పతాకం ముందు తల వంచి నమస్కరించే అవకాశం వచ్చిందంటే అది భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశమేనని మోడీ అన్నారు. ఇంతకుముందు పనిచేసిన అందరు ప్రధానమంత్రులకు, పాత ప్రభుత్వాలన్నింటికీ నా గౌరవ ప్రణామాలు అందజేస్తున్నాను. మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీని ఆధారంగానే దేశం ముందుకెళ్తోంది. ఎర్రకోట నుంచి నేను ప్రతి ఒక్క పార్లమెంటేరియన్కు, ప్రతి ఒక్క పార్టీకి ప్రణామాలు చేస్తున్నానని మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.