
కమాన్.. మేకిన్ ఇండియా: మోడీ పిలుపు
'కమ్.. మేక్ ఇన్ ఇండియా'. మేడిన్ ఇండియా అనే బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
దేశానికి ప్రధానమంత్రిగా కాదు.. ప్రధాన సేవకుడిగా మీ ముందుకు వచ్చానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తెల్లటి దుస్తులు, తెల్ల గెడ్డం, ఎర్రటి తలపాగాతో వచ్చిన మోడీ 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చారు. మన దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి లెక్కలేనంత మంది బలిదానాలు చేశారని, వాళ్ల జీవితం, యవ్వనమంతా జైళ్లలోనే గడిపేశారని అన్నారు. ఇలా ప్రాణాలు అర్పించిన, పోరాడిన అందరికీ శతకోటి వందనాలు అర్పించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
దేశం కోసం జీవితమంతా సాధన చేసే శ్రామికులను మనం అభినందించాలి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఓ బాలకుడు ఈ రోజు ఎర్రకోట నుంచి భారత త్రివర్ణ పతాకం ముందు తల వంచి నమస్కరించే అవకాశం వచ్చిందంటే అది భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశమే. ఇంతకుముందు పనిచేసిన అందరు ప్రధానమంత్రులకు, పాత ప్రభుత్వాలన్నింటికీ నా గౌరవ ప్రణామాలు అందజేస్తున్నాను. ఈ దేశం పురాతన సాంస్కృతిక సంప్రదాయాల పునాదులపై నిలబడింది. ఇక్కడ వేదకాలంలో మనకు ఒకటే మంత్రం వినిపించేది. 'సంగచ్ఛత్వం సంగత్వం సంబో మనాఫి జానతాం ' మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ మూలమంత్రం ఆధారంగానే దేశం ముందుకెళ్తోంది. ఎర్రకోట నుంచి నేను ప్రతి ఒక్క పార్లమెంటేరియన్కు, ప్రతి ఒక్క పార్టీకి ప్రణామాలు చేస్తున్నాను.
నాకు ఢిల్లీ అంటే ఏంటో తెలియదు. బయటనుంచి వచ్చాను. ఒక ఔట్సైడర్ ఢిల్లీ వచ్చి ఇన్సైడర్ వ్యూ చూశారు. నేను ఇక్కడ రాజకీయాలు చేయాలని రాలేదు. ఇక ప్రభుత్వం లోపల కూడా అనేక ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమతమ సొంత రాజ్యాలు నడిపిస్తున్నారు. ఒక శాఖ మరోశాఖతో కొట్టుకుంటోంది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు ఒకే ప్రభుత్వంలో రెండు శాఖలు కొట్టుకుంటున్నాయి. ఒకే దేశానికి చెందిన ప్రజలు ఇలా చేస్తే దేశం ఎలా ముందుకెళ్తుంది? ఇలాంటి గోడలను పడగొట్టడానికి నేను ప్రయత్నం మొదలుపెట్టాను.
మన దేశంలో పాప కొంచెం పెద్దదయ్యిందంటే చాలు.. బయటకెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, వెళ్లగానే ఫోన్ చెయ్యి అంటారు. అదే పిల్లాడిని అడుగుతున్నారా? ఎక్కడకు వెళ్తున్నావని, ఏం చేస్తున్నావని అడిగితే ఇన్ని అత్యాచారాలు జరిగేవా? ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్నవాళ్లు కూడా ఎవరో ఒకళ్ల పిల్లలే కదా. వాళ్లమీద తల్లిదండ్రులు ముందునుంచి తగిన నియంత్రణలు పెడితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేశంలో జరుగుతున్న అత్యాచారాలు చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నా. మన దేశంలో ఉన్న మావోయిస్టులు, ఉగ్రవాదులు కూడా ఎవరో ఒకళ్ల పిల్లలే కదా.. వాళ్ల తల్లిదండ్రులు కూడా తప్పుదోవ పట్టద్దని అడిగితే ఇన్ని ప్రాణాలు పోవు కదా! హింసాత్మక మార్గంలోకి వెళ్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే. మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కొంత ఇచ్చారు. భుజాల మీద తుపాకులు పెట్టుకుని మీరు భూమాతను రక్తసిక్తం చేస్తారు. అదే భుజాల మీద నాగలి పెట్టుకుంటే అదే భూమాత పచ్చగా మారుతుంది. ఎందుకీ రక్తపాతం? అశోకుడు కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు. కానీ యుద్ధాలు వదిలి బుద్ధుడి మార్గం వైపు మళ్లారు.
మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక ప్రభుత్వ కార్యాలయాలు సమయానికి తెరుచుకుంటాయని అంతా అన్నారు. కానీ దానివల్ల నాకు ఆనందం కాదు.. బాధ అనిపిస్తోంది. ఈ దేశంలో ప్రభుత్వాధికారులు సమయానికి ఆఫీసులకు వెళ్లడం అంటే పెద్ద వార్త అవుతుందా.. అవుతోందంటే మనమంతా బాధపడాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ల సామర్థ్యం చాలా ఎక్కువ ఉంది. చప్రాసీ నుంచి సెక్రటరీ వరకు అందరికీ శక్తి సామర్థ్యాలున్నాయి, వాటిని నేను మేల్కొలిపి దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇదే మాట నేను 16 మే నాడు చెప్పలేను. కానీ ఈ మూడు నెలల అనుభవంతో ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. దౌర్భాగ్యం ఏమిటంటే, మనం ఎక్కడైనా ఎవరి వద్దకైనా ఏదైనా పనిమీద వెళ్తే, 'ఇందులో నాకేమొస్తుంది' అంటారు. ఏమీ రాదనిపిస్తే, నాకేమిస్తావని అడుగుతారు. ఇదే మన దేశదుస్థితికి కారణం.
ఇటీవలే కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. వాటిలో అనేక పతకాలు వచ్చాయి. అయితే ఈ పతకాలు తెచ్చినవాళ్లలో 39 మంది అమ్మాయిలున్నారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెబుదాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభివృద్ధి మాత్రమే మార్గం. సుపరిపాలన మాత్రమే మార్గం. ఈ రెండింటితోనే మనం ముందుకు వెళ్దాం. ప్రైవేటు ఉద్యోగులను అడిగితే ఉద్యోగం చేస్తున్నామంటారు. అదే ప్రభుత్వోద్యోగులైతే సేవ చేస్తున్నా అంటారు. ఈ భావాన్ని పునరుజ్జీవింపజేద్దాం. దేశ ప్రజలంతా ఒక్క అడుగు ముందుకు వేస్తే దేశం కోటీ 25 లక్షల అడుగులు ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి జనధన యోజన అనే కార్యక్రమంతో దేశవాసులను పేదరికం నుంచి బయటకు తీసుకు రావాలి. దేశంలో చాలామందికి మొబైల్ ఫోన్లున్నాయి గానీ బ్యాంకు ఖాతాలు లేవు. ఈ పథకం కింద డెబిట్ కార్డుతో పాటు ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయల జీవిత బీమా కూడా అందిస్తాం. ఏ కుటుంబంలోనైనా ఏమైనా జరిగితే వాళ్లకు ఈ లక్ష రూపాయలు అండగా ఉంటాయి. మన దేశంలో ఎక్కువ మంది యువకులున్నారు. దేశానికి నైపుణ్యం ఉన్న వాళ్ల అవసరం ఉంది. 'స్కిల్ ఇండియా'ను మనం రూపొందించుకోవాలి. అందరూ రండి .. దేశాన్ని తయారుచేసుకుందాం. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, వీళ్లందరూ దేశ నిర్మాతలు. ప్రపంచంలో ఎక్కడైనా చదవండి. కానీ నిర్మాణం ఇక్కడ చేయండి. 'కమ్.. మేక్ ఇన్ ఇండియా'. మేడిన్ ఇండియా అనే బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగాలి. మన దేశంలో శక్తి సామర్థ్యాలున్నాయి. ప్రపంచానికి చేసి చూపిద్దాం.. 'మేడిన్ ఇండియా'. ఏదైనా మనం విదేశాల నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవాలి? దిగుమతులు మానేసి.. ఎగుమతులు చేసే స్థితికి మనం రావాలి. ప్రతి ఒక్కళ్లూ మనం దిగుమతి చేసుకునే ఒక్కో వస్తువును సొంతంగా చేయడానికి ప్రయత్నించండి. రెండు విషయాల్లో మీరు రాజీ పడొద్దు. అందులో ఒక్కలోపం కూడా ఉండకూడదు. అలా ఉంటే విదేశాల నుంచి అవి తిరిగొస్తాయి. అలాగే పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకూడదు. 'జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్'లా ఉండాలి.
మన దేశాన్ని పాములు ఆడించుకునేవాళ్ల దేశమని అన్నారు. కానీ మన నైపుణ్యం గురించి వాళ్లకు తెలియదు. కంప్యూటర్లను మునివేళ్ల మీద ఆడించే సామర్థ్యం మనవాళ్లకు ఉంది. డిజిటల్ ఇండియాను రూపొందించాలి. దేశంలోని మారుమూల గ్రామంలో కూడా డిజిటల్ పాఠాలు చెప్పగలిగితే అప్పుడు ఉపయోగం ఉంటుంది. డాక్టర్లు చేరుకోలేని చోట టెలిమెడిసిన్ పనిచేస్తే.. దాని ఉపయోగం ఉంటుంది. మొబైల్ గవర్నెన్స్ మనం సాధించగలమా? పనులన్నింటినీ నడుచుకుంటూనే మొబైల్ గవర్నెన్స్ ద్వారా చేసుకోగలిగేలా ఉండాలి. మన దేశానికి పెట్రోలు దిగుమతులు తప్పనిసరి. కానీ వాటి తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నవి ఎలక్ట్రానిక్ పరికరాలే. వీటిని సొంతంగా చేసుకోగలిగితే దేశానికి బోలెడంత ఖర్చు మిగులుతుంది. ఒకప్పుడు రైళ్లు దేశాన్ని అనుసంధానం చేస్తాయని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఐటీ అలా అనుసంధానించాలి.
లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు తదితరులు ముందు వరుసలో ఆశీనులయ్యారు. వెన్నునొప్పితో బాధపడుతున్న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వేడుకలకు హాజరయ్యారు.