స్వరాజ్యం నుంచి సురాజ్యానికి! | Narendra Modi's speech on Independence Day 2016: Here's the full text | Sakshi
Sakshi News home page

స్వరాజ్యం నుంచి సురాజ్యానికి!

Published Tue, Aug 16 2016 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

స్వరాజ్యం నుంచి సురాజ్యానికి! - Sakshi

స్వరాజ్యం నుంచి సురాజ్యానికి!

ప్రభుత్వ మంత్రం ‘సంస్కరించు, ఆచరించు, మార్చు’
స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రధాని మోదీ
 
పాలనలో పారదర్శకత తీసుకొచ్చాం
* ‘ప్రజాకర్షణ’ ఖర్చు దూరం పెట్టాం.. అసమానతలకు చోటు లేదు
* ప్రగతికి సామాజిక న్యాయమే పునాది.. సేవల వేగం పెరిగింది
* ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టగలిగాం

సాక్షి, న్యూఢిల్లీ: ‘సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రజాకర్షణను పక్కనపెడుతూ.. సంస్కరించు, ఆచరించు, మార్చు అనే వ్యూహాన్ని అమలు చేయటానికి నేను ప్రయత్నిస్తున్నా.

స్వీయ పాలన నుంచి సుపరిపాలనకు ప్రయాణం మొత్తం దేశ ప్రజల సంకల్పం.. దానికోసం త్యాగాలు అవసరం. గత (యూపీఏ) ప్రభుత్వం ఆరోపణల్లో కూరుకుపోయింది. నా ప్రభుత్వం చుట్టూ ఆకాంక్షలు అల్లుకున్నాయి. ఆశ అనేది ఆకాంక్షలను పెంచినపుడు.. మేం సురాజ్ (సుపరిపాలన)వైపు వేగంగా వెళ్లటానికి అది శక్తినిస్తుంది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు, గ్రామ ప్రతినిధి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను నిర్వర్తించాలి’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ సోమవారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి 1.33 గంటల పాటు ప్రసంగించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన మోదీ.. బులెట్ ప్రూఫ్ అద్దాల కవచాన్ని కూడా వద్దని తిరస్కరించారు. ఎర్రకోటపై వరుసగా మూడోసారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ఆయన.. తన ప్రభుత్వ కృషి, సాధించిన విజయాలను, ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం సరళతరం చేయటం, పేదలు, రైతుల కోసం సంక్షేమ పథకాల గురించి వివరించటంపై దృష్టి పెట్టారు.

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ను 20 శాతం పెంచుతున్నామని, దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు రూ. 1 లక్ష వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. దేశంలో అనాదిగా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలైన కులతత్వం, అంటరానితనాల విషయంలో కఠిన, సున్నిత వైఖరి అవలంబించాలన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
సామరస్యమే ప్రగతికి పునాది...
‘భారత్ అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం వెనుక లక్షలాది మహాపురుషుల త్యాగం ఉంది. మన దేశానికి చారిత్రక నాగరికత ఉంది. మన సంస్కృతికి ఎల్లలేవు. భారత్ వయసు 70 ఏళ్లు కాదు.. బానిసత్వం నుంచి స్వతంత్య్రం పొంది 70 ఏళ్లు అయ్యింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశాన్ని ఒక్కతాటిపై నిలిపారు. సామాజిక న్యాయం ప్రాతిపదికగా గల బలమైన సమాజం లేకుండా బలమైన దేశాన్ని నిర్మించజాలం. దేశ ప్రగతికి సామాజిక సామరస్యం కీలకం. బుద్ధదేవుడు, గాంధీ, రామానుజాచార్య,అంబేడ్కర్, మన పవిత్ర గ్రంథాలు, రుషులు, బోధకులు బలంగా చెప్పింది సామాజిక సమైక్యత గురించే. సమాజం విచ్ఛిన్నమైనపుడు సామ్రాజ్యం ముక్కలవుతుంది.

సమాజం అంటగలిగే వారు, అంటరాని వారుగా; అగ్ర, అధమ(కులాలు(గా) చీలితే.. అటువంటి సమాజం మనజాలదు. సమాజంలో అందరూ ఒక్కటే. పెద్దవాళ్లు, పిల్లలు అందరూ ఒక్కటే. అసమానతనలను ఎట్టిపరిస్థితిల్లోను సహించేది లేదు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు ఎవరైనా దేశ పౌరులే. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉంది.’’
 
చెప్పుకుంటూ పోతే వారం పడుతుంది...
‘ప్రభుత్వం ఏం చేస్తోందన్నదానిపై అన్ని విషయాలను  చెప్పగలను. అందుకు నేను వారం రోజులపాటు ఇక్కడే నిలుచుని మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఈ రోజు ప్రభుత్వ విధానాల గురించి, ఉద్దేశాల గురించి మాట్లాడడం లేదు. సురాజ్యం గురించి మాట్లాడుతున్నానంటే అది సామన్యుల జీవితాన్ని మార్చడమే.
 
* ఒక మంచి ఆస్పత్రికి వెళ్లడానికి ప్రజలకు చాలా కాలం పట్టే రోజులు ఉండేవి. కానీ ఈ రోజు వాటన్నింటిని మార్చేశాం. అన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అపాయింట్‌మెంట్లు పొందవచ్చు. ఈ విధానాన్ని ఇప్పటికి వరకు 40 పెద్ద ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నాం.
 ససామన్య ప్రజానీకం రైలు టిక్కెట్ పొందడానికి ప్రయాసపడేవారు. ఇప్పుడు.. ఒక సెకనులో 15 వేల టిక్కెట్లను పొందేలా పారదర్శకతను అమలు చేస్తున్నాం.పన్నుల వాపసుకు మూడు వారాలకంటే ఎక్కువ కావడం లేదు.
 
* గతంలో పాస్‌పోర్ట్ పొందడానికి కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు కొన్ని వారాల్లోనే పొందొచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా కింది స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నాం. లక్షల ఉద్యోగాలకు మధ్యవర్తుల అవసరం లేకుండా చేశాం.
 
* మేం 70 కోట్ల మందిని ఆధార్, సామాజిక భదత్రా పథకాలకు అనుసంధానం చేశాం. గత 60 ఏళ్లలో 14 కోట్ల మంది వంట గ్యాస్ కనెక్షన్లు పొందారు. మా ప్రభుత్వం వచ్చిన 60 వారాల్ల్లో 4 కోట్ల మందికి కొత్త గ్యాస్ కనెక్షన్లు  ఇచ్చాం. 2 కోట్ల మరుగుదొడ్లతో సుమారు 70 వేల గ్రామాలు బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందాయి. బొగ్గు గనుల వేలంలో  పారదర్శకత తీసుకొచ్చాం.
 
* 2014లో 18 వేల గ్రామాలకు కరెంటు లేదు. మేం వచ్చిన తరువాత వెయ్యి రోజుల్లో ఆ గ్రామాలకు విద్యుత్‌ను అందివ్వాలనుకున్నాం. నిర్దేశించుకున్న సమయంలో సగం కూడా పూర్తవకుండానే 10 వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించాం. రూ. 350 విలువచేసే ఎల్‌ఈడీ బల్బును కేవ రూ. 50కే అందిస్తున్నాం. 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మీరు కూడా ఎల్‌ఈడీ బల్బులనే వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. విద్యుత్‌ను ఆదా చేసి దేశానికి సహాయం చేయడంలో భాగస్వామ్యులు అవ్వండి.
 
మహిళలు, యువతుల సంక్షేమం...
‘మహిళలు, యువతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముద్ర పథకం ద్వారా 3.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
 
* బేటీ బచావ్, బేటీ పడావ్, సుఖన్యా సమృద్ధి, ఉజ్వల్ యోజనా, ప్రసూతి సెలవుల సవరణ ద్వారా గర్భిణులకు 26 వారాల జీతంతో సెలవులను అందిస్తున్నాం. జన్ ధన్ యోజనా ద్వారా ఇప్పటి వరకు 21 కోట్ల మంది బ్యాంకు అకౌంట్ల పొందారు.
 
* సులభ వ్యాపారం చేయడంలో భారత స్థానం మెరుగైంది. జీడీపీ వృద్ధిలో ఇతర దేశాలను భారత్ వెనక్కునెట్టింది. భారత సంస్కరణల్లో సుదీర్ఘకాలం నిలిచే జీఎస్టీ బిల్లూ ఇటీవలే ఆమోదం పొందింది. జీఎస్టీతో అన్ని పన్నులు ఏకం కానున్నాయి.
 
సమరయోధులకు పెరిగిన పెన్షన్...
70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వతంత్య్ర సమరయోధులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ. 25 వేల పెన్షన్‌ను రూ. 30 వేలు చేస్తున్నట్లు మోదీ చెప్పారు. స్వతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆదివాసీ సమరయోధులకు దేశ వ్యాప్తంగా ప్రదర్శనశాల, స్మారక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మోదీ వెల్లడించారు. అలాగే.. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న పేదల వైద్య ఖర్చుల్లో రూ. లక్ష వరకు ప్రభుత్వం భరిస్తుందన్నారు.
 
పేద ప్రజల విస్తరి భారం కానివ్వను...
* ‘‘గత ప్రభుత్వ హయాంలోద్రవ్యోల్బణం 10% దాటింది. కానీ మా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ద్రల్యోల్బణం ఆరు శాతానికి మించకుండా ఉంది. ద్రవ్యోల్బణం వల్ల పేద ప్రజల ఆహార విస్తరి భారం కాకుండా శాయశక్తులా కృషి చేస్తా. ద్రవ్యోల్బణాన్ని ఇంకా 4 నుంచి 2 శాతానికి తగ్గించడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది.
* పప్పుల ఉత్పాదకత తగ్గినా.. వాటి ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పప్పు ధాన్య రైతులకు సంబంధించి బోనస్‌ను, పథకాలను ప్రకటించాం. వారు 1.5 రెట్లు అధికంగా పప్పులు పండించారు.
* ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేస్తే గత ప్రభుత్వ కాలంలో లాఠీచార్జ్ జరిగేది. ఇప్పుడు ఎరువుల కొరతలేదు.
* రైతుల వ్యవసాయ పెట్టుబడిని తగ్గించడానికి 77 వేల పంపు సెట్లను ఇచ్చాం. అసంపూర్తిగా ఉన్న రూ. 7.5 లక్షల కోట్ల విలువైన 118 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. మరో రూ. 10 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టులను పునఃప్రారంభించాలని గుర్తించాం.
* గతంలో ఒక యూనిట్ విద్యుత్ రూ. 10 ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో రూ. 1గా ఉంది.
* ఖతర్‌తో గ్యాస్ దిగుమతి ఒప్పందం ద్వారా రూ. 20 వేల కోట్లు ఆదా కానుంది.’’
 
డేగ కళ్లతో నిఘా
న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకల వేళ  ఢిల్లీ శత్రుదుర్భేద్యంగా మారింది. ఎర్రకోట చుట్టుపక్కలా వేల మంది పోలీసులు, ఇతర భద్రతా విభాగాలు డేగ కళ్లతో పహారా నిర్వహించాయి. ఉదయం 7.20 గంటలకు ఎర్రకోట లాహోర్ గేట్ వద్ద ప్రధాని మోదీకి రక్షణ శాఖ మంత్రి  పరీకర్ తదితరులు ఆహ్వానం పలికారు. గౌరవ వందనం స్వీకరించే ప్రాంతానికి చేరుకోగానే ఇంటర్ సర్వీసెస్ సిబ్బంది, పోలీసు గార్డులు సెల్యూట్ చేశారు. అనంతరం ఆర్మీ, నౌకాదళం, వాయుసేన అధికారులు, సిబ్బంది నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు.

ఎర్రకోట వేదికకు చేరుకుని ఉదయం 7.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సమయంలో భద్రతా బలగాలు 21 తుపాకులు పేల్చి వందనం సమర్పించాయి. తర్వాత ప్రధాని చిన్నారుల వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. వేడుకలకు 40 వేలమంది హాజరయ్యారు.  
* బుల్లెట్ ప్రూఫ్ లేకుండానే.. మూడో ఏడాది కూడా మోదీ బుల్లెట్ ప్రూఫ్ రక్షణ లేకుండానే ఎర్రకోటపై నుంచి ప్రసగించారు.
* ఎర్రకోటపై నల్ల గాలిపటం.. మోదీ జాతీయ జెండా ఎగురవేయడానికి ఎర్రకోట వద్దకు రావడానికి కొద్దిసేపటి ముందు, ఎర్రకోటపై నల్లని గాలిపటం ఎగురుతూ కనిపించింది.  భద్రతా సిబ్బంది వెంటనే గాలిపటాన్ని తొలగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement